Monday, December 23, 2024

ఆయుధాలతో సిఎం మమత నివాసంలోకి చొరబాటు యత్నం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద కలకలం రేగింది. ఆయుధాలతో కూడిన కారుతో లోపలికి చొరబడేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని నూర్ ఆలంగా గుర్తించారు. కోటు, టై ధరించిన అతడు పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో కోల్‌కతా నగరంలోని కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అరెస్టు చేశారని సిపి వినీత్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. ‘ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

అతడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి. గంజాయి కూడా దొరికింది. బీఎస్‌ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. అతడు సిఎంను కలవాలనుకున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్నాం’ అని వెల్లడించారు. అతడి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకుగానూ మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News