నలుగురు కొడుకులు పుట్టారు… పున్నామి నరకం నుంచి తప్పిస్తారని ఆశపడ్డ ఆ తల్లికి ఆశాభంగమే అయింది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా ఫించన్ డబ్బులు కావాలని ఓ కొడుకు తల్లిపై దాడి చేయడంతో కిందపడ్డ ఆ తల్లి కాలు విరిగింది. కాలు విరిగి అచేతనాస్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేసి కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి కొడుకు తల్లిని బతికుండగానే శ్మశానంలో పడేశాడు. దాంతో వారం రోజులుగా ఎముకలు కొరికే చలిలో ఆ తల్లి నరకయాతన పడింది. ఆ తల్లి దీన పరిస్థితి చూసినవారు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకుని అచేతనస్థితిలో ఉన్న అవ్వను సఖి కేంద్రానికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని చిలుకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. భర్త చనిపోవడంతో కుమారులను పెంచి పెద్ద చేసింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో కొడుకులు తల్లి పోషణ గురించి పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేశారు.
దాంతో ఆ తల్లి రోడ్డున పడింది. ఎవరైనా దయతలిచి భోజనం పెడితే తినడం… లేదంటే పస్తులుంటూ కాలం వెళ్లదీస్తోంది. తల్లి పోషణ గురించి పట్టించుకోకుండా రోడ్డున పడేసిన కొడుకుల్లో మూడో కొడుకు తాగుడుకు బానిసై ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని తరచూ వేధించేవాడు. ఇటీవల డబ్బుల కోసం తల్లిపై దాడి చేయడంతో కిందపడడంతో ఆమె కాలు విరిగిపోయింది. కాలు విరిగిన తల్లికి వైద్యం చేయించి సపర్యలు చేయాల్సిన ఆ కొడుకు తల్లిని మోతె రోడ్డులోని శ్మశానవాటికలోకి చేర్చాడు. అక్కడి ఓ గదిలోకి చేరిన రాజవ్వ చిమ్మచీకటి, ఎముకలు కొరికే చలిలో విరిగిన కాలు నొప్పితో నరకయాతన పడింది. కనీసం బహిర్భూమికి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె అదే గదిలో మలవిసర్జన చేయడం… ఆ దుర్గంధంలోనే వారం రోజులపాటు కాలం వెళ్లదీస్తూ వచ్చింది. శ్మశానంలో రాజవ్వ పడుతున్న కష్టాన్ని చూసిన స్థానికులు ఇటు మీడియాకు, అటు అధికారులకు సమాచారం అందించారు.
వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి నరేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్మశానానికి చేరుకుని రాజవ్వను వాహనంలో సఖి కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. రాజవ్వ కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, వారు రాజవ్వను పోషించని పక్షంలో హైదరాబాద్‌కు తరలిస్తామని సంక్షేమ శాఖ అధికారి నరేశ్ పేర్కొన్నారు.