రెండు కార్లు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దక్షిణ కొరియా నుండి ఇండియా పర్యటనలో భాగంగా భద్రాచలం పరిసర ప్రాంతాలు సందర్శించేందుకు ముగ్గురు వ్యక్తులు ఒక గైడును వెంట బెట్టుకొని కారులో భద్రాచలంనకు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలానికి చెందిన వానపాకుల సాంబశివరావు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ, నాలుగు రోజుల క్రితం బూర్గంపాడు మండలం, వేలేరులోని తమ బంధువుల ఇంట శుభకార్యానికి వచ్చాడు. అనంతరం తన భార్య శ్రీలత, మరదలు సంధ్య లతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరాడు.
అదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన వినోభానగర్ సమీపంలో రెండు కార్లు అతివేగంతో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌లు అందించిన సమాచారం మేరకు 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుండి గాయపడిన దక్షిణ కొరియా వాసులు ఖమ్మంలోని సురక్ష హాస్పిటల్‌లో తక్షణ వైద్యం పొందుతుండగా, తీవ్రంగా గాయపడిన వానపాకుల సాంబశివరావు కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.