ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) నీటి పరిశుభ్రత ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిన ఒక వ్యక్తి మృతదేహాన్ని సుమారు 12 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆదివారం వెలుపలికి తీసుకువచ్చినట్లు ఢిల్లీ జల వనరుల శాఖ మంత్రి ఆతిషి తెలియజేశారు. సుమారు 30 ఏళ్ల ఆ వ్యక్తిని ఇంకా గుర్తించవలసి ఉంది. ‘బోరుబావిలో పడిపోయిన వ్యక్తి చనిపోయినట్లుగా రక్షక బృందం గుర్తించినట్లు ఎంతో విచారగ్రస్థంగా వెల్లడిస్తున్నాను’ అని మంత్రి ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
‘అతను బోరుబావి గదిలోకి ఎలా వెళ్లాడన్నది, బోరుబావిలో ఎలా పడిపోయాడన్నది పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అన్ని గంటల పాటు రక్షణ కార్యక్రమం కోసం శాయశక్తులా ప్రయత్నించినందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందానికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ ఢిల్లీ కేశోపూర్ మండి ప్రాంతంలోని డిజెబి ప్లాంట్‌లోని బోరుబావిలో ఒక వ్యక్తి పడిపోయినట్లుగా ఆదివారం తెల్లవారు జామున సుమారు ఒంటి గంటకు సమాచారం అందింది.