కూకట్‌పల్లి : పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిఆర్‌ఎస్ పార్టీ మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ మూసాపేటలోని తన పాత ఇంటిని కూల్చివేసేందుకు గానూ అందులో అద్దెకు ఉంటున్న వారిని బుధవారం ఖాళీ చేయించి కూల్చివేతలను ప్రారంభించారు. అయితే అందులోని ఓ కిరాయి దారుడైన స్వామి రెడ్డిరాజు(45) గత కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ రోజూలాగే రాత్రి రూంలో నిద్రపోయాడు. ఇది గమనించని కాంట్రాక్టర్ బుధవారం అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటిని కూల్చివేసే పనులను ప్రారంభించాడు.
అందులో చిక్కుకున్న రెడ్డిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కూల్చి వేసిన వ్యర్ధాలను తొలగిస్తుండగా మృతదేహం లభ్యమైంది. విషయాన్ని స్ధానిక పోలిసులకు ఫిర్యాదు చేసిన వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆరాతీయగా ఇంట్లో అద్దెకు ఉంటున్న స్వామి రెడ్డిరాజు మృతదేహంగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రెడ్డి రాజుకు భార్య ఇద్దరు పిల్లలు. ఇతను గత కొన్ని నెలలుగా ఇళ్లు అద్దెకు తీసుకుని కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. రెడ్డిరాజు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు సమచారం అందించడంతో పాటుగా మృతదేహాన్ని పోస్టుమాత్రం నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.