లక్నో: ఓ జంట 25 సంవత్సరాల పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. భర్త గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా షూ వ్యాపారి అయిన.. వసీం సర్వత్(50), ఆయన భార్య ఫరా వివాహం జరిగిన 25 సంవత్సరాలు పూర్తయింది. దీంతో తమ బంధువులు, మిత్రులకు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు.
పార్టీ ఆరంభం కాగానే.. ఇద్దరు భార్య, భర్తలు కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కేక్ కట్టింగ్ కూడా చేయాల్సి ఉంది. అయితే డ్యాన్స్ చేస్తూనే వసీం కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వసీం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే వసీంకి గుండె సంబంధిత జబ్బులు ఉన్నాయి కానీ, వాటిని గుర్తించకపోవడమే ఈ విషాదానికి కారణమైందని డాక్టర్లు చెప్పారు. ఉపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నా.. హార్ట్‌బీట్ క్రమంగా లేకపోయినా.. వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సీనియర్ కార్టియాలజిస్ట్ తెలిపారు.
వసీం మృతితో సంబరాలు జరగాల్సిన చోట విషాదం నెలకొంది. వసీం భార్య ఫరా స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వసీం డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.