జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో మృతుడి బంధువుల విధ్వంసం
జ్వరంతో వస్తే మా అన్న ప్రాణాలు తీశారు
మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇవ్వడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడయ్యాయి
-మృతుడి సోదరి ఆవేదన
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కొనసాగుతుండగా, మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరుతో చేసే దోపిడీకి అంతులేకుండా పోతుంది. సెకండ్ వేవ్ వైరస్ ఆసుపత్రులకు అందివచ్చిన వరంలా మారింది. దీంతో అడ్డంగా దోచుకునే పనిలో ఆసుపత్రుల యాజమాన్యాలు రాటుదేలుతున్నాయి. మృతిచెందిన వారి కుటుంబాలు బిల్లు చెల్లించేవరకు శవాలు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తూ అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది కార్పొరేట్ మాఫియా. గురువారం జూబ్లీహిల్స్‌లో విరంచి ఆసుపత్రిలో కరోనా వైద్యం కోసం వచ్చి యువకుని ప్రాణాలు బలిగొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈనెల 9వ తేదీన నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ (35) జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. 17 రోజుల చికిత్స చేసి వైద్యులు గురువారం మధ్యాహ్నం చనిపోయినట్లు చెప్పారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. వైద్యులు సరైన చికిత్స చేయకుండా, స్టెరాయిడ్స్ అధికంగా ఇవ్వడంతో లంగ్స్, కిడ్నీలు పాడై చనిపోయాడని మృతుని సోదరి ఆరోపించింది. వైద్యం చేసిన డాక్టర్ దిలీప్ తమకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏ తప్ప చేయకపోతే డబ్బులు కట్టకుండా శవాన్ని ఎందుకు తీసుకెళ్లమని చెప్పారని ప్రశ్నించింది. తన అన్న చనిపోలేదని, వైద్యులే చంపేశారని ఆరోపించింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం, బంధువుల మధ్య ఘర్షణ పెరగడంతో దాడి చేసి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి వారి అరెస్టు చేసి గోషామహల్ పోలీసుస్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మృతి కుటుంబీకుల అరెస్టుపై అగ్రహం వ్యక్తం చేస్తున్న నగరవాసులు:
ప్రైవేటు ఆసుపత్రులు రోగుల ప్రాణాలు తీయడమే కాకుండా వైద్య చికిత్స గురించి అడిగినందుకు మృతునికి కుటుంబానికి చెందిన 16మంది అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. వైద్యం లేని చికిత్సకు లక్షరూపాయలు దోచుకుంటూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూంటే కాపాడాల్సిన పోలీసులు దొంగలకు వంతపాటడం విమర్శలకు తావునిస్తుంది. యువకుని ప్రాణాలు తీసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యం చేసిన డాక్టర్‌పై కేసు పెట్టి, మృతుని కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Man dies due to doctor’s Negligence in Virinchi Hospital