Wednesday, January 22, 2025

వైద్యం వికటించి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -
  • ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన

కీసర: ఛాతిలో మంటతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం కీసరలో జరిగింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ నాయక్ (35)కు చాతిలో మంటగా ఉండటంతో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కుటుంబసభ్యులు చికిత్స కోసం కీసరలోని లైఫ్ సేవ్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

శ్రీనివాస్ నాయక్‌ను పరీక్షించిన అక్కడి వైద్యులు బిపి సాధారణంగా ఉండటంతో గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి ఇంజక్షన్ ఇచ్చి చికిత్స చేశారు. అక్కడి నుండి ఇంటికి బయలుదేరిన శ్రీనివాస్ నాయక్ మార్గ మధ్యలో చాతిలో నొప్పిగా ఉందనడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. నిర్లక్షంగా వైద్యం చేయడంతో వికటింటి శ్రీనివాస్ నాయక్ మృతి చెందాడని బంధువులు మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ నాయక్‌కు భార్య పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లైప్ సేవ్ హాస్పిటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News