న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయడంలో రైల్వేల పనితీరు మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలులోని భోజనమే నాణ్యత విషయంలో ప్రశ్నార్థకం కావడం సంచలనం సృష్టిస్తోంది. రాణి కమలాపతి నుంచి జబల్‌పూర్ జంక్షన్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి రైల్వేలు అందచేసిన భోజనంలో చచ్చిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆ ప్రయాణికుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎక్స్ వేదికగా ఎండగట్టడంతో ఐఆర్‌సిటిసి ఈ ఘటనపై వెంటనే స్పందించింది. సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే&వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనకు అందచేసిన నాన్ వెజ్ భోజనం ఫోటోలను డాక్టర్ శుభేందు కేశరి అనే ప్రయాణికుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.
ఆ ఫోటోలలో బొద్దింగ స్పష్టంగా కనపడుతోంది. 2024 ఫిబ్రి 1వ తేదీన తాను ట్రెయిన్ నంబర్ 20173లో ఆర్‌కెఎంపి నుంచి జెబిఆర్‌కు (వందే భారత్ ఎక్స్‌ప్రెస్)లో ప్రయాణిస్తున్నానని ఆయన తన పోస్టులో తెలిపారు. రైల్వే సిబ్బంది అందచేసిన ఫుడ్ ప్యాకెట్‌లో చచ్చిన బొద్దింకను చూసి తాను దిగ్భ్రాంతి చెందానని ఆయన చెప్పారు. దీనిపై ఐఆర్‌సిటిసి వెంటనే స్పందించింది. చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ప్రయాణికుడికి క్షమాపణ చెప్పింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సంబంధిత సర్వీసు ప్రొవైడర్‌కు భారీ జరిమానా విధించామని తెలిపింది. ఇకపైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఐఆర్‌సిటిసి హామీ ఇచ్చింది.