ఎసిబి అధికారులు వస్తున్నారని తెలిసి స్టౌ అంటించి తగలబెట్టిన మాజీ ఎంపిటిసి వెంకటయ్య గౌడ్
మైనింగ్ అనుమతి కోసం వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్‌కు ఇవ్వడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకటయ్య
మనతెలంగాణ/కల్వకుర్తి/వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల తహసీల్దార్ సైదులు గౌడ్ మంగళవారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసిబి, డిఎస్పీ కృష్ణాగౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 61లో 32 ఎకరాల స్థలంలో మైనింగ్ అనుమతి కావాలని తలకొండ పల్లి మండలం, కోడింత తండా సర్పంచ్ రాములు వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్‌ను కలిశారు. అందుకు ఎన్‌ఓసి ఇవ్వడానికి 6 లక్షల రూపాయలను తహసీల్దార్ డిమాండ్ చేయడంతో రూ.5 లక్షలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నెలరోజులుగా అనుమతి కోసం తిరుగుతుండగా నాలుగు రోజుల క్రితం కుదిరిన ఒప్పందం ప్రకారం తహసీల్దార్ సైదులు గౌడ్ సూచన మేరకు కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న చదరవెల్లి మాజీ ఎంపిటిసి వెంకటయ్యగౌడ్‌ను కలిసి డబ్బులు ఇవ్వాలని చెప్పారు.
ఒప్పందం ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెంకటయ్యగౌడ్ నివాసంలో 5 లక్షల రూపాయల డబ్బులు రాములు ఇవ్వడం జరిగింది. ఏసిబి అధికారులు వస్తున్నారని గమనించిన వెంకటయ్య గౌడ్ ఇంటి గడియ పెట్టుకుని లంచంగా తీసుకున్న ఐదు లక్షల రూపాయలను స్టౌవ్ పై పెట్టి అంటించారు. వెంటనే ఏసిబి అధికారులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి మంటలను ఆర్పి వెంకటయ్య గౌడ్‌ను అదుపులోకి తీసుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 6 లక్షలు డిమాండ్ చేసిన సమయంలో రాములు ఏసిబి అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఏకకాలంలో ఏసిబి అధికారులు వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో సైదులుగౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని తహసీల్దార్ సైదులు ఇంటితో పాటు మాజీ వైస్ ఎంపిపి వెంకటయ్య గౌడ్ ఇళ్ళలో సైతం సోదాలు నిర్వహించారు. వీరు ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసిబి డిఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఈ దాడులలో ఏసిబి ఎస్సై లింగం, మరో ఆరుగురు సిబ్బంది పాల్గొన్నారు.
Man fires Rs 5 lakhs before ACB Raids in Kalwakurthy