ఒక వివాహిత మహిళను తీసుకుని పారిపోయినందుకు ఒక వ్యక్తిని చితకబాదిన ఆమె బంధువులు అతడి చేత బలవంతంగా మూత్రం తాగించి మెడలో చెప్పుల దండ వేసి చితకబాదారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా బాధితుడి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మెడలో చెప్పుల దండ వేసుకున్న ఒక వ్యక్తిని కొందరు దూషిస్తూ అతని చేత ఒక సీసాలో మూత్రంగా భావిస్తున్న ద్రవాన్ని బలవంతంగా తాగిస్తున్న దృశ్యాలు ఒక వీడియోలో దర్శనమిచ్చాయి. తాను తీసుకువెళ్లిపోయిన మహిళ చేతిలోనే బాధితుడు తన్నులు తింటున్న దృశ్యాలు కూడా అందులో కనిపించాయి.
ఒక చేతిలో చెప్పును పట్టుకుని దాన్ని నాకుతూ మరో చెప్పును తలపైన బాధితుడు పెట్టుకున్న దృశ్యాలతో మరో వీడియో కూడా వెలుగుచూసింది. సగం మీసాలు, సగం గుండుతో బాధితుడు కనిపించాడు. ఈ వీడియో క్లిప్పులను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అదనపు ఎస్‌పి నితీష్ భార్గవ బుధవారం విలేకరులకు తెలిపారు. మూడు, నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నామని, బాధితుడిని సంప్రదించామని ఆయన చెప్పారు. ఈ వీడియోలు పోలీసుల దృష్టికి రాగానే బాధితుడి ఇంటికి వెళ్లామని, అతను ఇంట్లో లేడని ఆయన తెలిపారు. తాను బాధితుడితో ఫోన్‌లో మాట్లాడినట్లు ఎఎస్‌పి చెప్పారు. వచ్చి తనను కలుస్తానని బాధితుడు చెప్పాడని, బాధితుడితో మాట్లాడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా..జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలోని భట్‌పచ్‌లానా పోలీసు స్టేషన్ పరిధిలోని భిల్ఖేడీ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు వర్గాలు తెలిపాయి. బంజారా తెగకు చెందిన ఒక వివాహిత మహిళను తీసుకుని పారిపోయినందుకు ఆ వ్యక్తిపై దాడి జరిగినట్లు వారు చెప్పారు.