నాంపల్లి కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరిచింది. ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత తీర్పునివ్వటం జరిగింది. బాధితురాలికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే 2021, నవంబర్ 21న సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏడేళ్ల బాలిక తన ఇంటి యాజమాని ఇంట్లో టివి చూస్తుండగా పొరుగునే ఉంటున్న గాలి తరుణ్ (20) చిన్నారి వద్దకు వెళ్లాడు. తన వెంట వస్తే మ్యాజిక్ చూపిస్తానని బాలికను పిలిచాడు.
వెంట రావటానికి ఆమె నిరాకరించినా బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి అఘాయిత్యానికి చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో ఇంటి యజమాని కుమారుడు రాకేశ్ అటుగా వచ్చి బాలికను రక్షించాడు. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా సైఫాబాద్ ఎసిపి వేణుగోపాల్‌రెడ్డి కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. కేసును విచారించిన జడ్జి అనిత నిందితునికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. పకడ్బందీగా దర్యాప్తు జరిపి నిందితునికి శిక్ష పడేలా చూసిన ఎసిపి వేణుగోపాల్‌రెడ్డితో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.