Monday, January 20, 2025

ఆర్టీఐ ప్రశ్నకు 40,000 పేజీల జవాబు

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద అడిగిన ఒక ప్రశ్నకు 40,000 పేజీల సమాధానం అందడంతో వాటిని తరలించడానికి ఆ వ్యక్తి తన ఎస్‌యువిని వాడాల్సి వచ్చింది. తనకు నెలరోజుల్లోగా సమాచారం రాకపోవడంతో పేజీకి రూ. 2 చొప్పున ధర్మేంద్ర శుక్లా చెల్లించాల్సిన అవసరం కూడా లేకపోయింది.

కొవిడ్ మహమ్మారి కాలంలో మందులు, ఇతర సంబంధిత పరికరాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లు, బిల్లు చెల్లింపుల వివరాలు కోరుతూ ప్రధాన వైద్య, ఆరోగ్య అధికారి(సిఎంహెచ్‌ఓ)కు తాను ఆర్‌టిఐ కింద దరఖాస్తు చేసుకున్నానని ధర్మేంద్ర శుక్లా శనివారం తెలిపారు. తనకు నెలరోజుల్లోగా సమాచారం ఇవ్వకపోవడంతో అపెల్లేట్ అధికారి డాక్టర్ శరద్ గుప్తాను కలుసుకున్నానని, తన ఫిర్యాదును స్వీకరించిన ఆయన తనకు ఉచితంగా సమాచారం అందచేయాలని ఆదేశించారని శుక్లా వివరించారు.

కార్యాలయం నుంచి పత్రాలను తన ఇంటికి రవాణా చేయడానికి తన ఎస్‌యువిని తీసుకెళ్లానని, డ్రైవర్ సీటు మినహా కారు అందతా పత్రాలతో నిండిపోయిందని ఆయన చెప్పారు. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోవడంతో సంబంధిత పత్రాలను ఉచితంగా ఇవ్వాలని తానే ఆదేశించినట్లు అప్పెలెట్ అధికారి డాక్టర్ శరద్ గుప్తా తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 80,000 నష్టం వాటిల్లినందున సంబంధిత సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎంహెచ్‌ఓను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News