సిటిబ్యూరోః అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన వ్యక్తికి మేడ్చెల మల్కాజ్‌గిరి అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి రఘునాథ్‌రెడ్డి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన వల్లెపు జగన్నాథం కూతురు జయలక్ష్మిని వేడువాక సురేష్‌కు ఇచ్చి అక్టోబర్,07, 2011లో వివాహం చేశాడు. వివాహ సమయంలో పది లక్షల కట్నం మిగతా లాంఛనాలు ఇచ్చాడు. వీరికి ఒక బాబు కలిగాడు.
అన్ని లాంఛనాలు ఇచ్చినా కూడా సురేష్ భార్యను అదనపు కట్నం తేవాలని తరచూ వేధించేవాడు. వేధింపులు భరించలేక జయలక్ష్మి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. రాను రాను వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక జయలక్ష్మి జూలై 13, 2014లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేసి సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.