మనిషికి పంది గుండె, అమెరికా వైద్యుల ఘనత
వాషింగ్టన్: వైద్య రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన వైద్యబృందం జన్యుపరంగా మార్పులు చేసిన ఓ పందిగుండెను ఓ వ్యక్తికి విజయవంతంగా అమర్చింది. ఈ శస్త్రచికిత్స చేసిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ తాజాగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్ బెన్నెట్(57)హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సాంప్రదాయ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కృత్రిమ పంపింగ్‌కు ఆయన శరీరం సహకరించకపోవడంతో వైద్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మానవ శరీరంలో పొసగేలా జన్యసవరణలు చేసిన ఓ పందిగుండెను సేకరించి ఆయనకు విజయవంతంగా అమర్చారు. శస్త్ర చికిత్స జరిగి మూడు రోజులు కాగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతకు ముందు ఫుడ్ అండ్ డ్రగ్ అడినిస్ట్రేషన్ ఈ ఆపరేషన్ కోసం అత్యవసర అనుమతులు ముంజూరు చేసింది.
కాగా ఈ ప్రయోగం విజయవంతం అవుతుందన్న గ్యారంటీ లేదనే విషయం తన తండ్రికి తెలుసునని, అయితే ఆయన చనిపోతున్నారని, సాధారణ మనిషి గుండెమార్పిడికి వీలు కావడం లేదని, అందువల్ల ఇది తప్ప వేరే మార్గం లేదని బెన్నెట్ కుమారుడు అసోసియేటెడ్ ప్రెస్( ఎపి) వార్తాసంస్థకు తెలిపారు.‘చనిపోవడమో ..లేదా ఈ శస్త్ర చికిత్స చేయించుకోవడమో.. నా ముందు ఈ రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కానీ నేను బతకాలనుకున్నా.అందుకే అంగీకారం తెలిపా’ అని సదరు వ్యక్తి శస్త్ర చికిత్సకు ముందు చెప్పారు. అవయవాల కొరతను తీర్చే దిశగా ఇదొక ముందడుగు అని ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించిన డాక్టర్ డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమయితే బాధపడుతున్న రోగులకు ఈ అవయవాల సరఫరాకు కొరత ఉండదని మేరీలాండ్ యూనివర్సిటీలో జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ప్రోగ్రాం సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ మొహియుద్దీన్ చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లోనూ న్యూయార్క్‌లో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన విషయం తెలిసిందే.