Monday, January 20, 2025

భారత సంతతి చిన్నారి మరణం… నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మరణానికి కారణమైన యువకుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా లూసియానాలో 2021లో జరిగిన ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించింది. ఓ హోటల్ రూమ్‌లో ఆడుకుంటోన్న చిన్నారి తలకు బుల్లెట్ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన విమల్‌స్నేహాల్ పటేల్ దంపతులు లూసియానాలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. తమ చిన్నారి మాయ, మరో శిశువుతో కలిసి ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వారు నివాసం ఉంటున్నారు. ఓ రోజు హోటల్ బయట పార్కింగ్‌లో చిన్న గొడవ జరిగింది. శ్రేవ్ పోర్టుకు చెందిన జోసఫ్ లీ స్మిత్ అనే యువకుడు మరో వ్యక్తితో అక్కడ తగాదా పడ్డాడు.

ఈ సమయంలో తన దగ్గరున్న తుపాకీతో ఎదుటి వ్యక్తి నుదుటిపై స్మిత్ దాడి చేశాడు. దీంతో చేతిలో ఉన్న తుపాకీ పేలి, హోటల్ రూంలో తల్లితో ఆడుకుంటున్న చిన్నారికి తగిలింది. వెంటనే మాయ పటేల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులు ప్రాణాలతో పోరాడిన ఆ చిన్నారి చివరకు మార్చి 23, 2021న కన్నుమూసింది. ఈ కేసును విచారించిన అక్కడి జిల్లా న్యాయస్థానం, చిన్నారి మృతికి కారణమైన స్మిత్‌కు 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు విచారణను అడ్డుకున్నందుకు 20 ఏళ్లు, తీవ్ర నేరాలు పునరావృతం చేస్తున్నందుకు మరో 20 ఏళ్లు, మొత్తం 100 ఏళ్లు జైల్లోనే గడపాలని ఆదేశించింది. పెరోల్ లేదా శిక్షలో తగ్గింపు వంటి ఎటువంటి అవకాశాలు లేకుండా శిక్ష అమలు చేయాలని తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News