Tuesday, January 21, 2025

భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

- Advertisement -
- Advertisement -

సాధారణంగా తన భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని కొందరు ఫిర్యాదులు చేయడం చూశాం. ఇంకా ప్రియురాలి మోజులో తనను దూరం పెడుతున్నారని పెద్దల మధ్య పంచాయతీ పెట్టడమూ చూశాం. అయితే, ఇక్కడ జరిగిన ఘటన పూర్తిగా రివర్స్. ఇది వరకే రెండుసార్లు పెళ్లైన ఓ వ్యక్తికి అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మళ్లీ పెళ్లి చేశారు. అంతేకాదు, శుభలేఖలు అచ్చు వేయించి విందు భోజనాలు పెట్టించి మరీ ఘనంగా తమ భర్తకు మూడో పెళ్లి చేశారు. ఈ విచిత్ర ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామం. గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో తొలి వివాహం జరిగింది. అయితే, పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టాడు. అలా వారి జీవనం సాగుతుండగా, తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరగా అతనికి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేయాలని భావిం చారు.

ఈ క్రమంలో జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లక్ష్మిని తాను ఇష్టపడ్డ విషయం ఇద్దరు భార్య లకు చెప్పాడు. దీంతో వారే స్వయంగా వధువు ఇంటికి వెళ్లి మాట్లాడారు. పెద్దలు కూడా అంగీకరించడంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి వివాహం జరి పించేందుకు సిద్ధమై ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. తల్లిదండ్రులు లేని పండన్న ఇద్దరు భార్యలే సర్వస్యం అయ్యి పెళ్లి పెద్దలుగా దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖల్లో సైతం వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ముద్రించారు. ’మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన. ఆహ్వానితులు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ’ అంటూ ఇంటింటికీ వెళ్లి పెళ్లి పత్రికలు అందించి ఆహ్వానించారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు అంతా కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లి పత్రిక, పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు లక్కీయెస్ట్ వ్యక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News