Monday, January 20, 2025

ప్రాణం తీసిన ‘పతంగి’ దారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో పతంగులు ఎగురవేసే చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఆదివారం నాడు బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన భీమయ్య బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా మంచిర్యాలకు వచ్చి.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసు అధికారులు వివరించారు.

అలాగే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎజాజ్ అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల ప్రకారం వివరాల మేరకు పట్టణంలోని షేక్‌చాంద్ అనే యువకుడు ఆదివారం చైనా మాంజాతో గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఎజాజ్ అనే యువకుడు అటువైపు నుంచి బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు ఆయనను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా గాలిపటం కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురైన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ములుగుకు చెందిన పన్నెండేళ్ల బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్ స్తంభానికి చిక్కుకుపోయింది. దీంతో పతంగి కోసం బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.అప్రమత్తమైన లైన్‌మెన్ కరెంటు సరఫరా నిలిపేసి బాలుడిని కిందికి దింపారు. అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

Man Killed after Manjha slits his throat in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News