Wednesday, January 22, 2025

పాత కక్షలతో ఒకరి హత్య

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: పాత కక్షలతో ఒకరు హత్యకు గురైన సంఘటన మండలంలోని లింగగిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగగిరి గ్రామానికి చెందిన జంగిలి పెద్దరాజు(40) అదే గ్రామానికి చెందిన దాసరి మార్కండేయకు గత కొద్ది రోజులుగా వ్యవసాయ బావి వద్ద గొడవలు జరుగుతున్నాయి. సోమవారం జంగిలి పెద్దరాజు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మొక్కజొన్న చేనుకు మందు పిచికారి చేసి వస్తుండగా మార్కండేయ పెద్ద రాజును పారతో తలపై గట్టిగా కొట్టడంతో పెద్ద రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనకు గురైన మార్కండేయ పెద్ద రాజును ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో పడేసి ఇంటికి వెళ్లాడు. పెద్ద రాజు సాయంత్రం అయినా కూడా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా జాడ దొరకకపోవడంతో గ్రామస్థులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలికి చేరుకున్న ఎస్ఐ మహేందర్ తన సిబ్బందితో చుట్టు పక్కల చూసుకుంటూ బావి వద్దకు వెళ్లారు. బావి వద్ద రక్తపు మరకలు ఉండటంతో పెద్దరాజు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. రక్తపు మరకల ఆధారంగా చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించగా దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. బావిలో టార్చిలైట్ల సహకారంతో చూడటంతో పెద్ద రాజు మృతదేహం బావిలో ఉన్నట్లు గుర్తించి గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎసిపి
మండలంలోని లింగగిరి గ్రామంలో హత్య జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించి అనంతరం బావి వద్దకు వెళ్లి క్లూస్ టీంతో కలిసి రక్తపు నమూనాలను పరిశీలించి సేకరించారు. అనంతరం రక్త నమూనాలను ల్యాబ్ తరలించినట్లు తెలిపారు.
మృతదేహంతో గ్రామంలో రాస్తారోకో
లింగగిరిలో గ్రామంలో పెద్ద రాజు హత్యకు గురికాగా మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామంలో ఎలాంటి గొడవలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో నెక్కొండ సీఐ హతిరాం, చెన్నారావుపేట ఎస్సై మహేందర్, నెక్కొండ ఎస్సై సీమా ఫర్హీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News