పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం సమీపంలో ఉన్న రెగి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడనే కోపంతో ఓ వ్యక్తి ఆ గ్రూప్ అడ్మిన్‌కి తుపాకీతో కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు ముస్తాక్ అహ్మద్.. అష్ఫక్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో గొడవ చేయడంతో అతన్ని ఆయన గ్రూప్ నుంచి తొలగించాడు.
దీంతో అష్ఫక్ కోపంతో తుపాకీ తీసుకొని వచ్చి ముస్తాక్‌పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు హుమాయున్ ఖాన్ అక్కడే ఉన్నప్పటికీ అతను ఏమీ చేయలేకపోయాడు. ‘నా సోదరుడు, అష్ఫక్‌కు మధ్య వాట్సాప్ గ్రూప్‌లో గొడవ జరిగిందట. దీంతో ముస్తాక్, అష్ఫక్‌ని ఆ గ్రూప్ నుంచి తొలగించాడు. అది చాలా చిన్న విషయం. కానీ, దానికే మా సోదరుడిని కాల్చి చంపేశాడు’ అని హుమాయున్ తెలిపాడు.
హుమాయున్ ఫిర్యాదుతో పోలీసులు అష్ఫక్‌పై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.