ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి గొడ్డలితో తన కోడలిని నరికి చంపినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాథీపూర్ కురియా గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నటు ఎస్‌పి రాజేష్ కుమార్ ద్వివేది తెలియజేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన తరువాత ఒక బృందాన్ని హుటాహుటిని ఆ ప్రదేశానికి పంపారు. తన కోడలు సుమిత్ర (30)ని హత్య చేసిన రాజ్‌పాల్ సత్య (70) పారిపోయినట్లు ఆదిలో భావించారు.
కానీ ఒక తోటలో ఒక చెట్టుకు అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు, గ్రామస్థుల కథనాన్ని ఎస్‌పి ద్వివేది ఉటంకిస్తూ, నిందితుడు తాగుబోతు అని, హతురాలితో వాదనకి దిగి ఉంటాడని, ఆగ్రహంతో అతను ఇంటిలో ఉంచిన గొడ్డలితో ఆమెను నరికి చంపాడని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం పోలీస్ సిబ్బంది నేర ప్రదేశాన్ని పరీక్షించి తిరిగి వస్తుండగా గ్రామంలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని రాజ్‌పాల్ ఆత్మహత్య చేసుకున్నాడని వారికి సమాచారం అందిందని ఎస్‌పి వివరించారు.