స్కాక్‌హోం: నార్వే రాజధాని ఓస్లోలోని కాంగ్స్‌బర్గ్ పట్టణం సమీపంలో బుధవారం ఓ ముష్కరుడు విల్లు బాణాలు ధరించి ఐదుగురిని చంపేశాడు. మరో ఇద్దరు గాయపడ్డంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తిని కాంగ్స్‌బర్గ్ పోలీసలు అరెస్టు చేశారు. ‘దీనికంతటికీ ఒకడే కారణమని మాకు సమాచారం అందింది’ అని పోలీస్ చీఫ్ ఓయింగ్ ఆస్ తెలిపారు.
తాత్కాలిక ప్రధాని ఎర్నా సోల్‌బర్గ్ ఈ దాడిని ‘క్రూరమైనది’గా అభివర్ణించారు. దాడికి పాల్పడిన ముష్కరుడి ఉద్దేశ్యాలేమై ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం ఊహాగానమే కాగలదన్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు నగరంలో తిరుగుతూ జనులను బాణాలతో వధించాడు. ఆ వ్యక్తిని ఇంకా ప్రశ్నించలేదని పోలీస్ చీఫ్ ఆస్ తెలిపారు. ఇదిలావుండగా నగర అధికారులు దాడికి బాధితులైన వారిని, వారి బంధువులను మద్దతు ఇచ్చేందుకు సమావేశానికి రావలసిందిగా స్థానిక హోటల్‌కు పిలిచారు.