హైదరాబాద్: రెండు వందల రూపాయలు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన సంఘటన హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లా నందనవనం గ్రామానికి చెందిన బద్రి నాగేందర్(60) హైదరాబాద్‌లో అడ్డాపై కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నారాయణ్‌పేట్ జిల్లా ముమ్మిడి గ్రామానికి చెందిన ఆశప్ప(55) పాతబస్తీలోని గౌలిగూడ లేబర్ అడ్డా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో ఫుట్‌పాత్‌లపైనే జీవనం సాగించేవారు. నాగేందర్, ఆశప్ప పక్క పక్కనే పడుకున్నారు. నాగేందర్ జేబులో రెండు వందల రూపాయలు లేకపోవడంతో ఎవరో దొంగలించారని అనుకున్నాడు. పక్కన ఉన్న ఆశప్ప అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా పలుమార్లు తిట్టాడు. నన్నెందుకు తిడుతున్నావని అడగడంతో తాను రెండు వందల రూపాయలు తీయలేదని పలుమార్లు బదులిచ్చాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆశప్ప తలపై నాగేందర్ రాయితో కొట్టడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.