సిటిబ్యూరోః మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, కొట్టరెడ్డి పాలెం మండలం, భవనం వారి పాలెంకు చెందిన ఇంటూరి జగదీష్(24) హైదరాబాద్‌లోని కల్పతరువు కన్‌స్ట్రక్చన్ కంపెనీలో 2021 నుంచి సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కంపెనీకి చెందిన కాళీమందిర్, బండ్లగూడలోని కంపెనీ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నాడు. జగదీష్ మామ ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో వెంటనే గెస్ట్ హౌస్‌కు వచ్చాడు. అక్కడ ఉన్న వారు 18వ తేదీ రాత్రి 11.30గంటలకు హైదర్‌షాకోట్‌లోని స్నేహితుడు మనోజ్‌కుమార్ రూమ్‌కు వెళ్లాడని తెలిపాడు.
వెంటనే సామ్రాట్ రెసిడెన్సీలోని మనోజ్‌కుమార్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ ఫ్లాట్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూసేసరికి జగదీష్ రూమ్‌లో గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మనోజ్‌కుమార్ అతడి స్నేహితులతో జరిగిన గొడవలో అందరు కలిసి జగదీష్‌పై దాడి చేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.