Wednesday, January 22, 2025

లండన్-ముంబై విమానంలో స్మోకింగ్.. కాళ్లూ చేతులు కట్టేసి కూర్చోబెట్టి..

- Advertisement -
- Advertisement -

ముంబై : విమాన ప్రయాణికుల దురుసుతనంపై ఇటీవల తరచుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ అమెరికన్ పౌరుడు లండన్ ముంబై ఎయిరిండియా విమానంలో టాయ్‌లెట్‌లో ధూమపానం చేయడంతోపాటు, తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదైందని ముంబై పోలీసులు ఆదివారం వెల్లడించారు. నిందితుడు 37 ఏళ్ల రమాకాంత్ మార్చి 11న అర్ధరాత్రి విమానం టాయిలెట్‌లో స్మోకింగ్ చేయడంతోపాటు ఇతరులకు అసౌకర్యం కలిగించడం, పైలట్ ఇన్ కమాండ్ చట్టపరమైన ఆదేశాలను పాటించక పోవడం, భద్రతకు ప్రమాదం కలిగించడం తదితర నేరారోపణలపై ముంబై సహార్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్లు 336, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22,23, 25 సెక్షన్ల కింద కేసు నమోదైందని పోలీసులు చెప్పారు. “విమానంలో స్మోకింగ్‌ను అనుమతించరు. కానీ నిందితుడు విమానం బాత్ రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ కాలుస్తుండడంతో అలారం మోగడం ప్రారంభమైంది. మేం వెంటనే ఆయన చేతి లోని సిగరెట్‌ను తోసి పారేశాం. రమాకాంత్ సిబ్బందిపై కేకలు వేయడం ప్రారంభించాడు. ఎలాగోలా ఆయనను సీటు వద్దకు తెచ్చి కూర్చోబెట్టాం.

కొంతసేపు తర్వాత విమానం డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. అతని జిమ్మిక్కులు చూసి ప్రయాణికులంతా నివ్వెర పోయారు. ఆయన మేం చెప్పింది వినిపించుకోకుండా కేకలు వేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన కాళ్లు, చేతులు కట్టివేసి సీటులో కూర్చునేలా చేశాం. ” అని సిబ్బంది ఒకరు సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు అప్పటికీ ఊరుకోకుండా తలను బాదుకోవడం చేశాడు. “ ప్రయాణికుల్లో ఒక డాక్టరు వచ్చి ఆయనను పరీక్షించారు. నిందితుడు రమాకాంత్ తన బ్యాగ్‌లో మెడిసిన్ ఉందని చెప్పాడు. కానీ బ్యాగ్‌లో ఈ సిగరెట్ తప్ప ఇంకేమీ లేదు. దాన్ని స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు చెప్పారు. ముంబైలో విమానం ఆగగానే నిందితుడు రమాకాంత్‌ను సహార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని ఐపిసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భారత సంతతికి చెందిన వ్యక్తే అయినప్పటికీ అమెరికా పౌరుడని, అమెరికా పాస్‌పోర్టు కలిగి ఉన్నాడని పోలీసులు వివరించారు. నిందితుడు తాగిన మైకంలోఉన్నాడా లేక మానసిక అస్వస్థతతో బాధపడుతున్నాడా అన్నది నిర్ణయించుకోడానికి ఆయన నమూనాలు పరీక్ష కోసం పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News