నూస్ డెస్క్: చనిపోయాడనుకుని ఒక 60 ఏళ్ల వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. అయితే అదే వ్యక్తి మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని సఫాల్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే..జనవరి 29న మహారాష్ట్రలోని బోయిసర్, పాల్ఘర్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలు దాటుతూ ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఆ గుర్తుతెలియని వ్యక్తి ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా పంపిణీ చేశారు. ఈ ఫోటోలను చూసి పాల్ఘర్‌కు చెందిన ఒక వ్యక్తి పోలీసులను సంప్రదించాడు.
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన సోదరుడు రఫీఖ్ షేక్ అని, ఆటో నడిపే తన సోదరుడు రెండు నెలల క్రితం అదృశ్యమయ్యాడని అతను తెలిపాడు. తాము పోలీసు కంప్లయింట్ ఇచ్చిన విషయాన్ని కూడా అతను తెలిపాడు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మృతుడి భార్యకు పోలీసులు ఫోన్ చేశారు. కేరళలో ఉన్న ఆమె వెంటనే పాల్ఘర్‌కు బయల్దేరింది. మృతదేహాన్ని చూసి అది తన భర్తదే అని కూడా ధ్రువీకరించింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు ఆమెకు అప్పగించారు. కొద్ది రోజుల క్రితమే ఆ మృతదేహాన్ని వారు ఖననం కూడా చేశారు.
ఇదిలా ఉండగా..ఆదివారం నాడు రఫీఖ్ షేక్ మిత్రుడు ఒకరు తన మిత్రుడికి మామూలుగా మొబైల్ ఫోన్‌లో కాల్ చేశాడు. ఆ ఫోన్‌కు రఫీఖ్ స్పందించాడు. ఇద్దరూ చాలా సేపు వీడియో కాల్‌లో ముచ్చటించుకున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, పాల్ఘర్‌లో ఒ అనాథాశ్రమంలో ఉన్నానని రఫీఖ్ తెలిపాడు.రఫీఖ్ చనిపోలేదని, బతికే ఉన్నాడని తెలియచేస్తూ అతని మిత్రుడు ఈ వీడియో కాల్ సంభాషనను ఆ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇది చూసిన రఫీఖ్ బంధువులు వెంటనే పోలీసులను సంప్రదించారు. కుటుంబ సభ్యులందరూ గుర్తించాకే తాము మృతదేహాన్ని వారికి అప్పగించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థంకాక తలపట్టుకున్నారు. చనిపోయిన రఫీఖ్ బతికుంటే మరి ఖననం చేసిన వ్యక్తి ఎవరై ఉంటారన్న ప్రశ్న పోలీసులకు ఎదురవుతోంది. ఆ గుర్తు తెలియని మృతుడి ఆచూకీ కోసం పోలీసులు మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు.