హైదరాబాద్: నకిలీ హవీల్స్ విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.70లక్షల విలువైన నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… రాజస్థాన్ రాష్ట్రం, జాలోర్ జిల్లాకు చెందిన లలిత్ కుమార్ నగరంలోని ట్రూప్ బజార్‌లో ఎలక్ట్రిక్ షాప్ విక్రయిస్తున్నాడు. షాపు నిర్వహిస్తున్న నిందితుడు వస్తున్న డబ్బులు అవసరాలకు తీరకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.
దీంతో నకిలీ హవీల్స్ వైర్లు విక్రయించాలని ప్లాన్ వేశాడు. దీని కోసం నిందితుడు నకిలీ వైర్లు సరఫరా చేస్తున్న ఢిల్లీకి చెందిన దేవారాంను సంప్రదించాడు. అతడి వద్ద నకిలీ వైర్లు కొనుగోలు చేసి ఇంటిలో నిల్వ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఫలక్‌నూమా పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.