గుజరాత్ స్థానిక కోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఒక పరువు హత్య కేసులో ముద్దాయికి కోర్టు మరణశిక్ష విధించింది. గర్భవతి అయిన తన సోదరిని, ఆమె భర్తను హతమార్చిన వ్యక్తికి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జెఎ ఠక్కర్ మంగళవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇది అత్యంత అరుదైన కోవలోకి వచ్చే కేసని, భార్యాభర్తలతోపాటు కడుపులో పెరుగుతున్న శిశువును చంపి ముగ్గురి హత్యకు కారకుడైన వ్యక్తికి మరణశిక్షే సరైనదని న్యాయమూర్తి పేర్కొన్నారు. 2018 సెప్టెంబర్‌లో సనంద్ పట్టణంలో హార్దిక్ చావ్డా అనే వ్యక్తి నడిరోడ్డులో జనాలు చూస్తుండగా గర్భవతి అయిన తన సోదరి తరుణాబెన్‌ను(21) ఎనిమిది సార్లు, ఆమె భర్త విశాల్ పార్మర్‌ను(22) 17 సార్లు కత్తితో పొడిచి హత్యచేశాడు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు హార్దిక్ చావ్డా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దోషికి మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల పరువు హత్యలకు పాల్పడే వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.