బెంగళూరు: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన కర్నాటకలోని ఫ్యామిలీ కోర్టు వద్ద ఓ వ్యక్తి తన భార్యను కొడవలితో గొంతు కోశాడు. దాడి అనంతరం ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా, చుట్టుపక్కలవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
కొన్ని నిమిషాల ముందు, కౌన్సెలింగ్ సెషన్‌లో, ఈ జంట తమ విభేదాలను పూడ్చిపెట్టి, కలిసి బతికేందుకు అంగీకరించారు. హసన్ జిల్లా హోలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో గంటపాటు కౌన్సెలింగ్ తర్వాత బయటకు రాగానే భార్య చైత్రపై శివకుమార్ దాడి చేశాడు. ఆమెను వెంబడించి వాష్‌రూమ్‌కు వెళ్లి కొడవలితో గొంతు కోసేశాడు. నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కలవారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
చైత్రను ఆసుపత్రికి తరలించగా ఆమెకు కృత్రిమ శ్వాస అందించారు. గొంతుపై లోతైన గాటు పడడంతో రక్తాన్ని కోల్పోయిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. శివకుమార్‌పై హత్య కేసు నమోదైంది. ఆ వ్యక్తి కోర్టు కాంప్లెక్స్ లోపలికి ఆయుధాన్ని ఎలా తెచ్చాడన్న దానిపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
“కోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగింది. అతడిని మా కస్టడీలో ఉంచాం. అతడు నేరం చేసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. కౌన్సెలింగ్ తర్వాత ఏం జరిగిందో, కోర్టు లోపల ఆయుధాన్ని ఎలా తీసుకెళ్లాడనే దానిపై విచారణ జరుపుతాం. ఇది పథకం ప్రకారం జరిగిన హత్యా, విచారణలో వివరాలు తెలుస్తాయి’ అని హసన్‌లోని సీనియర్ పోలీసు హరిరామ్ శంకర్ తెలిపారు.