ప్రకాశం: సజీవ సమాధి అవ్వడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల క్రితం మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఊరు శివార్లలో తమ పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం ముందే పెద్ద గొయ్యి తీసి వారం రోజులుగా పైన రేకు కప్పుకొని అందులో ధ్యానం చేస్తున్నాడు. ఉగాది పండుగ రోజు సజీవ సమాధి అయ్యేందుకు నిర్ణయించుకొని తెల్లవారుజామున 5 గంటలకు ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం గొయ్యిలోకి దిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అతని కుమారుడు పైన రేకు పెట్టి మట్టితో దాన్ని కప్పేశాడు.
విషయం తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి అక్కడకు చేరుకొని బయటకు రావాలని కోరాడు. కానీ, కోటిరెడ్డి వినలేదు. దీంతో సమాచారం అందుకు పోలీసులు, ఘటనస్థలికి చేరుకొని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ గొయ్యిలోకి దిగిన కోటిరెడ్డి మళ్లీ ధ్యనం ప్రారంభించాడు. కుటుంబసభ్యులు, స్థానిక పెద్దలు చెప్పడంతో అతను బయటకు వచ్చి ఇంటికి చేరుకున్నాడు.