ప్రపంచం లోనే తొలిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా పంది కిడ్నీ తో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొని చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ మరణించారు. ఆయన స్వగృహంలో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు నెలల క్రితం మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. అది సక్రమంగా పనిచేయడంతో రెండు వారాల తరువాత డిశ్చార్జ్ చేశారు.
ఆ తర్వాత రెండు నెలల పాటు అతడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదు. ఈ నేపథ్యంలో రిచర్డ్ ఆకస్మిక మరణానికి శస్త్రచికిత్సకు సంబంధం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రిచర్డ్ స్లేమాన్ మరణించడం పట్ల జనరల్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఇటీవల అతడికి చేసిన అవయవ మార్పిడి వల్ల ఈ ఘటన జరగలేదని పరీక్షల్లో తేలింది. అయితే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.