ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్లపై ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన
బి కేటగిరీ సీట్ల భర్తీపై ప్రతియేటా ఫిర్యాదులు, ఆరోపణలు కోట్ల రూపాయల్లో
ప్రైవేటు కాలేజీల దందా విమర్శలకు చెక్‌పెట్టే దిశగా అడుగులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఏటా బీ కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యం లో దీనికి శాశ్వత విధానాన్ని రూపొందించింది. నూ తన విధానాన్ని సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సమర్పించగా,దీనిపై సర్కార్ నిర్ణయం తీసుకుంటే వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా బీ కేటగిరీ సీట్లు భర్తీ కానున్నా యి. ఈ సమస్యకు పరిష్కారం చూపితే తమ వైపు వేలెత్తి చూపేవారే ఉండరని, మరోవైపు తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో వచ్చే విద్యాసంవత్సరం ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చేయాలని ఉన్నత విద్యామండలి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని అన్ని ఇంజినీరిం గ్ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లను మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేస్తోంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం బీ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ విభాగం సీట్లను జెఇఇ మెయిన్ లేదా ఎప్‌సెట్ ర్యాంకు లేదా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మెరిట్‌ను పట్టించుకోకుండా, ఎక్కువ చెల్లించేందుకు ఎవరు ముందుకొస్తే వారికే యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
ఏటా రూ.కోట్ల రూపాయల వసూళ్లు దందా
రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, అందులో 20 వేలకుపైగా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిఫియల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వద్ద సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సగటున ఒక్కో సీటు రూ.5 లక్షలకు అమ్ముకున్నా యాజమాన్యాలు కోట్లలో దండుకుంటున్నాయని అంచనా.
మరోవైపు సీట్ల అమ్మకం వ్యవహారంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఏటా ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదులు చేయడంతోపాటు ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు తక్కువ మొత్తానికి సీట్లు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారని ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది.ఎంబిబిఎస్ తరహాలో ఎ,బి,సి కేటగిరీలుగా విభజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్‌లో బి, సి కేటగిరీ సీట్లకు ఫీజును నిర్ణయించి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్ల కూడా ఎంబిబిఎస్ తరహాలోనే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.