- భారత్, చైనా సంబంధాల మెరుగుదల కృషిలో భాగం
- యాత్రకు ఐదు సంవత్సరాలు విరామం
న్యూఢిల్లీ: ఐదు సంవత్సరాల విరామం అనంతరం కైలాస్ మానససరోవర్ యాత్ర జూన్‌లో తిరిగి ప్రారంభం అవుతుందని భారత్ శనివారం ప్రకటించింది. భారత్, చైనా నిరుడు అక్టోబర్‌లో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం దెమ్‌చోక్, దెప్సాంగ్ ఘర్షణ ప్రాంతాల వద్ద సైనికుల ఉపసంహరణను పూర్తి చేసిన తరువాత సంబంధాల మెరుగుదలకు రెండు దేశాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కైలాస్ మానససరోవర్ యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ‘విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) నిర్వహించే కైలాస్ మానససరోవర్ యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు సాగనున్నది’ అని భారత్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కైలాస మానససరోవర్ యాత్ర 2020 తరువాత సాగలేదు. ‘ఈ ఏడాది బృందానికి 50 మంది యాత్రికులతో ఐదు బృందాలు, బృందానికి 50 మంది యాత్రికులు వంతున పది బృందాలు వరుసగా లిపులేఖ్ కనుమ గుండా ఉత్తరాఖండ్ మీదుగా, నాథు లా కనుమ గుండా సిక్కిం రాష్ట్రం మీదుగా సాగనున్నాయి’ అని ఎంఇఎ ఆ ప్రకటనలో వివరించింది. యాత్ర కోసం దరఖాస్తులను కెఎంవై.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చునని ఎంఇఎ సూచించింది. ‘నిష్పాక్షిక, కంప్యూటర్ ఆధారిత, లింగ సమతౌల్య ఎంపిక ప్రక్రియ ద్వారా దరఖాస్తుదారుల నుంచి యాత్రికుల ఎంపిక జరుగుతుంది’ అని ఎంఇఎ తెలియజేసింది.