Thursday, January 23, 2025

మంచిర్యాల జిల్లాలో బిజెపికి షాక్

- Advertisement -
- Advertisement -

మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్ రాజీనామా..
అదే బాటలో మరికొందరు…

Mancherial BJP President resigned

మన తెలంగాణ/క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మందమర్రి పట్టణ బిజెపి అధ్యక్షుడు మద్ది శంకర్‌తో పాటు మరి కొంతమంది రాజీనామా చేశారు. తెలంగాణ సమాజం పట్ల చిన్నచూపు, వివక్ష చూపుతున్న బిజెపి విధానాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మద్ది శంకర్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బిజెపిలో విలువ లేదని తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మద్ది శంకర్ వెల్లడించారు.

ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘తెలంగాణ సమాజం పట్ల చిన్నచూపు, వివక్ష చూపుతున్న బిజెపి పార్టీ విధానాలతో విసిగిపోయి, తెలంగాణ ఆత్మగౌరవానికి బిజెపిలో విలువ లేదని తెలిసి ఆ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలిచేస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. ఈ మాటను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల అతనికి సదభిప్రాయం లేదని అర్థమయ్యింది. అంతేగాక గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు ఉపసంహరించుకున్నారు. సింగరేణి కార్మికులు బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా వేదిస్తుండటం కూడా నన్ను కలిచివేసింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపిలో మనసు చంపుకుని ప్రజా వ్యతిరేకిగా ఉండలేను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆమరణ దీక్ష కూడా చేసిన నేను తెలంగాణ సమాజ పతనం ఆశిస్తున్న బిజెపిలో ఉండలేక రాజీనామా చేస్తున్నాను. నాతో పాటుగా బిజెపి మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్షణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువమోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్, బిసి మోర్చా మందమర్రి పట్టణ అద్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్యలు కూడా రాజీనామా చేస్తున్నారు. ఇన్నాళ్లు నాకు సహకరించిన బిజెపిలోని నా మిత్రులకు, నా సహచరులకు, అనుచరులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు నా రాజకీయ కార్యాచరణలో కూడా మీ అందరి సహకారం వుండాలని కోరుకుంటున్నాను.’ అని మద్ది శంకర్ లేఖలో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News