మంచిర్యాల: ప్రేమ పేరుతో వల వేసి యువతితో ఓ పార్టీ విద్యార్థి విభాగం నేత ప్రేమాయణం నడిపించాడు. అనంతరం పెళ్లి చేసుకుందామంటే కులాల ప్రస్తావన తీసుకరావడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెల్లపల్లిలోని మహ్మద్‌ఖాసీంబస్తీకి చెందిన ఈదునూరు శ్రీనాథ్ బిఆర్‌ఎస్‌వి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. హనుమాన్‌బస్తీకి చెందిన జంగపల్లి స్నేహిత(21) ప్రేమ పేరుతో వల వేశాడు.
ఆమెతో కొన్ని రోజుల ప్రేమాయణం నడిపించాడు. స్నేహిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో కులాల వేరు కావడంతో వివాహం చేసుకోనని నిరాకరించాడు. యువతి మోసపోయానని గ్రహించి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. స్నేహిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనాథ్‌పై ఆరోపణలు రావడంతో బిఆర్‌ఎస్ పార్టీ అతడి బిఆర్‌ఎస్‌వి నియోజకవర్గ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.