మంచిర్యాల: పాఠశాలలో ఉన్నప్పుడు ప్రేమ చిగురించడంతో యుక్త వయసు వచ్చాక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమపెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఉరేసుకుంది. ఈ విషయం తెలిసిన భగ్న ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిత్తపూర్ గ్రామంలో తీగుళ భగవాన్(23), మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(21) పాఠశాలలో చదువుకునే సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. సంగీత డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్ డిసిఎం వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సంగీత ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం తన అక్క కుమారుడు వియన్ష్‌కు భోజనం తినిపించాలని తల్లి సూచించింది. ఈ విషయంలో సంగీతతో తల్లిదండ్రులు గొడవకు దిగారు.
ఆమె తల్లిదండ్రుల పొలం పనులు నిమిత్తం బావి వద్దకు వెళ్లారు. ఆమె ఎవరితో ఫోన్‌లో మాట్లాడి అనంతరం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు దూలానికి వేలాడుతూ ఆమె కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని వెల్లడించారు. భగవాన్ పత్తి లోడుతో కుమురంభీం జిల్లా రేపల్లివాడకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా సంగీత చనిపోయిన విషయం తెలియడంతో పురుగుల మందు కొనుగోలు చేశాడు. బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామ శివారులోని మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సోదరుడు భరత్ భగవాన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో దారి వెంట వెతుకుతూ వెళ్లారు. రహదారిపై వ్యాన్ కనిపించడంతో మామిడి తోటలోకి వెళ్లి చూడగా నోట్లో నుంచి నురుగులతో కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. ప్రేమ పాశానికి ఇద్దరు బలికావడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. చిత్తపూర్, మామిడిగట్టు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.