తమ కుటుంబంలో ఆస్తి తగాదాలేమీ లేవని, కేవలం తనపై అక్కసుతోనే ఆస్తి తగాదాగా చిత్రీకరిస్తున్నారని సినీనటుడు మంచు మనోజ్ అన్నారు. మంచు మనోజ్ శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత కొంతకాలంగా పలు వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మోహన్‌బాబు తనయుడు మనోజ్ రంగారెడ్డి కలెక్టరేట్‌కు రావడం ఆసక్తిని రేకెత్తించింది. తన తండ్రి చేసిన ఫిర్యాదుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
ఈ మేరకు జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు విచారణకు హాజరైనట్లు ఆయన మీడియాకు తెలిపారు. తమ విద్యాసంస్థలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై తాను నిలదీయడంతో తన తండ్రి, తదితరులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి తమ కుటుంబంలో ఆస్తి తగాదాలేమీ లేవని వెల్లడించారు. కేవలం తనపై అక్కసుతోనే ఆస్తి తగాదాగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల యోగక్షేమాలే లక్షంగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.