హైదరాబాద్: ఆస్తి కోసమో… డబ్బు కోసమో తాను పోరాటం చేయడంలేదని నటుడు మంచు మనోజ్ తెలిపారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు. జల్‌పల్లిలోని నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చర్చలు జరిగాయి. మోహన్‌బాబు కుటుంబంలో వివాదం దృష్టా చర్చలు కొనసాగాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడారు. ఇది.. నా భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని తెలిపారు.
తన భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా తనతో ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇంట్లో వాళ్లపై కాదు అని, తనతో ఏం పోరాడినా పర్వాలేదన్నారు. తనని తొక్కేయడానికే తన భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తాను పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ అడిగానని, తన ఇంటి వద్ద మోహరించిన బౌన్సర్లను పోలీసులకు చూపించానని, తనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామన్న పోలీసులే పారిపోయారని, తన మనుషులను బెదిరించి పంపించేశారని, పోలీసులే ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తన మనుషులను పంపించే అధికారం పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని స్పష్టం చేశారు.