“చిత్ర పరిశ్రమ పెద్దలందరూ కలిసి ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే నేను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను… లేదంటే పోటీ చేస్తాను” అని హీరో మంచు విష్ణు అన్నారు. తాజాగా ఆయన ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై మరో లేఖ రాశారు. “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలోనే ‘మా’ భవన నిర్మాణం ప్రస్తావన వస్తోంది. గతంలో నేను ‘మా’ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవన నిర్మాణానికి 25 శాతం ఖర్చు బరిస్తానని మాటిచ్చాను. కానీ ఇప్పటివరకు భవన నిర్మాణం జరగడం లేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చా. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేనే ఇస్తా. నా కుటుంబంతో కలిసి నేనే భవనం నిర్మిస్తా” అని మంచు విష్ణు పేర్కొన్నారు. “1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మా నాన్న, చిరంజీవి మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.
ఇంతకుముందు ఉన్న మురళీ మోహన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీ మంచి పనులు చేశారు. ప్రస్తుతం ఉన్న నరేష్ అయితే ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్ట్ లకి అండగా నిలబడి వాళ్ళకి ఇన్సూరెన్స్‌లు, పెన్షన్స్ లాంటివే కాకుండా తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి సహాయం చేశారు. ఇలా ప్రతి అధ్యక్షుడు ‘మా’ సభ్యుల కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేశారు. ఇక నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే. ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ, కృష్ణం రాజు, సత్యనారాయణ, మా నాన్న, మురళీమోహన్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జయసుధ, రాజశేఖర్, జీవిత, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాస్, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కానీ పక్షంలో పోటీకి నేను సిద్ధం”అని మంచు విష్ణు తెలిపారు.
Manchu Vishnu Comments on ‘MAA’ Elections