హైదరాబాద్: జల్‌పల్లిలోని నటుడు మోహన్‌బాబు ఇంటికి మంచు విష్ణు వచ్చారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు మంచి విష్ణు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఇంటికి ఒకే కారులో మోహన్‌బాబు, విష్ణు వచ్చారు. మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని విష్ణు తెలిపారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది అని, పరిష్కరించుకుంటామని, గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించామని, కలిసేలా చేశామని విష్ణు మీడియాతో తెలిపారు.
మంచు కుటుంబంలో గత రెండు రోజుల నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో నటుడు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండో రోజుల క్రితం తనపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీంతో విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.