హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి మాదిగ కులానికి చెందిన నేతలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పేరు చెప్పుకొని దళిత వర్గాల నుంచి ఆయన రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని విరుచుకపడ్డారు. శుక్రవారం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. కడియం మాదిగ కులానికి చెందిన వాడు కాదని బైండ్ల కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మాదిగల ఎదుగుదలను కడియం జీర్ణించుకోలేకపోతున్నాడని దుయ్యబట్టారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాదిగనంటూ నమ్మిస్తూ రాజకీయంగా లబ్ధిపొందుతున్నారని మంద కృష్ణ ధ్వజమెత్తారు.
మాదిగాలను అడ్డం పెట్టుకొని ఆయన డిప్యూటీ సిఎం స్థాయి వరకు ఎదిగారని, ఎవరి ప్రోత్సాహం లేకుండా ఎదిగిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, ఎంపి పసునూరి దయాకర్‌లను అణగదొక్కింది కడియమేనని మంద కృష్ణ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య ఆరు నెలల కాకముందే తొక్కేసి ఆయన స్థానంలోకి వచ్చి కూర్చున్నారని, వరంగల్ ఎంపిగా ఉండి కూడా ఉపముఖ్యమంత్రి పదవి కన్నేశాడని విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాకుండా చేసింది కడియమేనని మంద కృష్ణ ధ్వజమెత్తారు.