మహబూబ్‌నగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాడని మందకృష్ణ మాట్లాడటం సిగ్గుచేటని మాలమహనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితుడే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని ఎన్నో సభలలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడిన విషయం మనకందరికి తెల్సిందే.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండుసార్లు బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులని దగా చేసి కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యాడని, 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మాదిగ కులం నుండి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించారన్నారు. 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాల కులం నుండి ఒకరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు, అంతకు మించి దళిత జాతికి కేసీఆర్ ప్రభుత్వం నుండి ఒరిగిందేం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితున్నిముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో ఇప్పుడు సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుకోవాలని ఆదేశించి ముందుకు నడిపిస్తున్న తరుణంలో, మందకృష్ణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాల కులస్తుడైన మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రై ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాడని మాదిగ జాతిని రెచ్చగొట్టడం దుర్మార్గమైన విషయంగా మేము పరిగణిస్తున్నామన్నారు.
అధికారం దళితుల చేతుల్లో ఉంటే ఎస్సీ వర్గీకరణ సమస్యను దళిత జాతిలోని 59 కులాల నాయకులు అందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవచ్చని సోయి లేకుండా మాదిగ జాతిని రెచ్చగొట్టడం మందకృష్ణ మాదిగ అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అరేందర్, జిల్లా కోశాధికారి వాల్తాటి ఆంజనేయులు, జిల్లా నాయకులు గుడ్ల రవికుమార్ , గోనెల ఆనంద్ , ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.