సర్వేలో నాపేరొస్తే కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది
ఇండ్లు ఇచ్చినా..బీ ఫాంలు ఇవ్వాలన్నా నేను సంతకం పెడితేనే
జిల్లాకు మంత్రి..నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఫైనల్
మోత్కూరులో మీడియాతో ఎమ్మెల్యే సామేల్
మన తెలంగాణ/మోత్కూరు: తుంగతుర్తి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే అని, ఇంకెవ్వడూ లేడని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాలన్నా తాను సంతకం పెడితేనే వస్తాయని, కార్యకర్తలు ఎవరి మాటలో నమ్మి అటు ఇటు పోవద్దన్నారు. చిల్లర మల్లర గాళ్లూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామేల్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ క్యాడర్ తిరుగుబాటు చేయడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడమేంటని జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యే సామేల్ చేసిన ఈ కామెంట్స్ కార్యకర్తల్లో హాట్ టాఫిక్ గా మారాయి.
ఆదివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆర్య వైశ్య భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా నన్ను గుర్తించారని, కాంగ్రెస్ చేసిన సర్వేలో నాపేరు రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం నాకు టికెట్ ఇచ్చిందని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని, కార్యకర్తలు కష్టపడి పని చేశారని మందుల సామేల్ తెలిపారు. రాష్ట్రాన్ని నడిపించేది సీఎం అయితే జిల్లాకు మంత్రి అని, కానీ నియోజకవర్గానికి అన్నీ ఎమ్మెల్యేనే ఫైనల్ అన్నారు. తుంగతుర్తికి 15 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రతినిధి లేడని, కార్యకర్తల కష్టంతో గెలిచిన తాను కేడర్ కు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.1300 కోట్ల నిధులు తెచ్చానన్నారు.
బునాదిగాని కాల్వ పనులను త్వరలోనే మంత్రి ఉత్తమ్ రెడ్డితో ప్రారంభిస్తామని, బిక్కేరుపై బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి వెంకట్ రెడ్డి, సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని, దానికి కూడా త్వరలోనే మంత్రి వెంకట్ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తానని మందుల సామేల్ తెలిపారు. మోత్కూరులో ఆర్టీసీ డిపోకు ఏడాది సమయం పడుతుందని, డిగ్రీ కాలేజీ, 30 పడకల ఆస్పత్రి కూడా త్వరలోనే వస్తాయన్నారు. మున్సిపాలిటీలో గుంట భూమిని కూడా కబ్జా కాకుండా చూస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఐరన్ లెగ్ అంటుండని, నీ చెల్లె లిక్కర్ దందాతోనే ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయాడన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏండ్లుగా జరుగుతున్న పోరాటానికి సమాజం కూడా మద్దతునిచ్చిందని, మంద కృష్ణ మాదిగ లాంటి నాయకుల పోరాటాలతో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పునిచ్చి రాష్ట్రాలకే అధికారం కట్టబెట్టిందని, దాంతో దేశంలోనే మొదటగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి రిజర్వేషన్లు అమలు చేసి దేశానికే తెలంగాణ ప్రభుత్వం దిక్చూచిలా మారిందన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తుందని మందుల సామేల్ తెలిపారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గుర్రం కవిత, మార్కెట్ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోచం జగన్, నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, గుండగోని రామచంద్రు, కంచర్ల యాదగిరిరెడ్డి, రాచకొండ బాలరాజు, మలిపెద్ది మల్లారెడ్డి, ముద్దం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.