Tuesday, December 24, 2024

ఊరు ఆమెకు కవితాగానం

- Advertisement -
- Advertisement -

బాల్యంలో ఆడిన కోతికొమ్మంచి ఆటలు, వీధిలో ఆడిన, పరుగు పందెం, సైకిల్ తొక్కడం, కబడ్డీ క్రీడలు, పాతపాటలకి డ్యాన్సులు… ఊరు ఊరంతా లలితే. అందుకే ‘దాతి’లో ప్రతి అక్షరం నిప్పుర్వ వెలుగుతోంది. పెళ్ళి తరువాత వెంటనే, హైదరాబాదు నగరానికి వలస. దేవలోకం నుండి మర్త్యలోకానికి. ప్రకృతి నుండి వికృతిలోకి. ఐనా ఊరి మీద ఆమె ఇష్ట స్వప్నం ఇంకా వాడిపోలేదు. అన్నని, అమ్మని కోల్పోయింది. ముఖ్యంగా దగ్గరి వారినీ, ఊరిని దిన దినం కోల్పోతున్న కాలాన ‘దాతి’ని బిగ్గరగా కౌగలించుకున్నది లలిత.

‘దాతి’ మీటిన శబ్దాలు ఆమెకి ఉప్పసనిచ్చాయి.ఊరిని, తన వృత్తిలో భాగమైన వారిని, వాటిని అభిమానించిన వారికి అదనపు విషాదం వెన్నంటే ఉంటుంది. ఊరు, చెరువు నీటి కాలువలు, బాల్యస్నేహాలు, అడ్డూ అదుపులేని ఆటలు, సహజక్రీడలు పంచే ఆనందం… ఇవేవీ డబ్బుతో కొలవలేం. వాటిని మరవలేం. ఊరిలోని మనుషులందరూ ప్రేమాస్పదులే. కులమతాలు కంచ్లై గ్రామాలని ఆక్రమించని రోజులవి. ఈ నేపథ్యం లలిత కలానికి సిరా అయ్యింది. అదే ఆలోచనలకి వెన్నముక అయ్యింది. ఆమె జీవన ప్రణాళిక అయ్యింది. కవితా వస్తువైంది. కథరాసినా, నవల రాసినా అదే ప్రధానభూమిక. ‘దాతి’ని ఊరికి ప్రతిరూపంగా మలిచింది.
ఇద్దరికీ సాహిత్యం అంటే పిచ్చి అభిమానం. కృష్ణమాచారిది నెమ్మదితనం. లలితది జడివాన వైనం. బతుకుపోరాటంలో ఇద్దరిదీ ఒకే స్థాయి చైతన్యం. కవిత్వ రచనలో చారి ‘డాకలి’ అయితే లలిత ‘ధాతి’ అయ్యింది. ఇద్దరూ వృత్తికులాలకి చిరునామా అయ్యారు. వృత్తిదారుల నాలుకలయ్యారు. వాళ్ళ, స్వరాలు, కలాలు పనిముట్లలాగే శబ్ధిస్తాయి. వారి జీవితాలు కూడా ఆధునికత, అత్యాధునిక, ప్రపంచీకరణ యంత్రభూతాల కోరల్లో నలిగిపోయాయి. వృత్తులు ఆధునికరింపబడితే వృత్తిదారులకి పొట్టగడుస్తుందని ఆశించారు. కాని యంత్రం పెట్టుబడి కుతంత్రం. స్వర్ణకార కార్మికులు ఆకలి మంటలకి ఆహుతి. లలిత కుటుంబం కూడా జీవనం గడపలేని పరిస్థితుల నుండి కాస్త తెరపి పొందారు. నిత్యం ఆర్థిక ఒడొదొడుకుల లోంచి, యాతనలలోంచి బతుకీడుస్తూ పోతున్నారు.
ఇలాంటివాళ్ళు ఎందుకు కవిత్వం రాస్తారు?
ఉప్పసకా? లేదా నిజంగానే సామాజిక మార్పుకోసమా? స్వీయ సంతృప్తా? చెప్పలేం. కాని తాను బతికిన, తమ బతుకు కోసం, తమలాంటి వాళ్ళకోసం రాయడం ఒక అవసరం బాధ్యత. అలాంటి అవసరాలు లేకుండా కేవలం ఇతరుల కోసం మాత్రమే గట్టుమీద కూచుని రాసే కవిత్వంలో నిజాయితీ ఉంటుందా? ఆ కవిత్వం ప్రజా శ్రేణులకు అర్థం అవుతుందా? అన్యధాకరణ ఏ పాళ్ళలో ఎలా ఉండాలో ఎవరైనా ఆలోచించారా? ఒక బృందం / వృత్తి సమూహం బాధలపై ఎలా రాయాలో ఎవరైనా ఏ ఒక్కరైనా చెబితే, రాస్తే ఎంత బాగుండేది?
ఇవేమీ ఆలోచించలేదు. తమకు తెలిసిన బతుకుల గురించి పోరాడుతూ, అందులో భాగంగా రాయడం లలిత తన బాధ్యతగా భావించింది. తాము తమ జీవన, ఆర్థిక పోరాటం చేస్తూ అందరి పోరాటంలో భాగం కావడం గొప్ప విషయం. ఈ పోరాటానికి సాహిత్య రూపం కల్పించడం కష్టమైనా దాన్ని సాధ్యం చేస్తున్నది. అలా వీళ్ళది ప్రజా సాహిత్య శ్రామిక పక్షపాత దాంపత్యం. వీళ్ళది ఒకటే తీరు జీవితం. ఒకే పోరాటం.
వీళ్ళది వృత్తి భాష. పల్లె మాండలికం. అనేక పనిముట్ల, పరికరాల పద జాలం. పనిముట్ల బతుకుల చిత్రణ. పండితోత్తములు ఇలాంటి రచనల్లో సాహిత్య పరిక్వత, వ్యక్తీకరణ నవ్యత, శైలీ విన్యాసాలు లేవంటారు. కాని సహజ సౌందర్య జీవిత చిత్రణ పుష్కలంగా ఉంది. వాస్తవిక రచనా శైలి నిండుగా పండిoది. సమకాలీనత లేకుండా కేవలం కాల్పనికత ఉంటే లాభం లేదు. వెరసి ఇప్పుడు రాస్తున్న విధానానికన్నా భిన్నంగా రాసి తమ అస్తిత్వాన్ని లోకానికి కొట్టొచ్చేట్లుగా వినిపించగలుగుతున్నది ‘దాతి’. ‘నూటొక్క విన్యాసం చేసి కుప్ప గూలిండు’ సామెతలా కాకుండా విన్యాస రహిత సామాజిక యదార్ధిక కవిత్వ రచన పాఠకులని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అది ప్రకృతిలా మనిషికి దగ్గర. ప్రాకృతిక పరిమళాలంటిన కవిత్వం కాబట్టి.
పాత్రోచిత భాష ఉన్నట్లే ఇతివృత్తోచిత భాష ఉంటుంది. అది కవుల రక్తనాళాలకంటి ఉన్న భాష. చాలామంది కవులు తమ కవిత్వాన్ని తామే కాపీ కొడతారు. ఇతరుల కవిత్వంతో ప్రభావితులై ఆ కవితా చరణాలను తమ కలం ద్వారా పలికిస్తారు. విదేశీ కవుల విదేశీ భాషాక్షరాలను ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో దించేస్తారు. కాని లలిత ప్రతి అక్షరం ఆమె సొంతం. ప్రతి అక్షరంపై తన భావాలపై తనదైన ముద్ర ఉంటుంది. ఆమె బతుకు ఛాయలో అవి విడదీయరాని భాగమై మెరుస్తుంటాయి.
ఇంతకీ లలిత భావజాలం ఏమిటి?
ఆ భావజాలాన్ని జీవితానికి అన్వయించుకుంటుందా? బూర్జువా రాజకీయ పక్షాల వలెనే అభ్యుదయ, విప్లవ రాజకీయ నిర్మాణాలు కూడా ‘కార్డు’ ఉందా లేదా అని చూస్తాయి. కార్డు ముక్క సభ్యత్వం తీసుకుని దానికి వ్యతిరేకంగా పనిచేసినా ఫరవాలేదు. కార్డు ఉంటే ఎలాంటి తప్పు చేసినా చూసీ చూడనట్లుంటారు చాలాసార్లు. నిర్మాణాల పట్ల ఒక విషయం. మానవుల పట్ల శ్రమ పట్ల దోపిడీ పట్ల వ్యతిరేకత కలిగి ఉండడం మరో కోణం. అలాంటి నిబద్ధత లలితకి సహజంగా అబ్బింది. కష్టాల కొలిమిలోంచి తనదైన భావజాలం ఏర్పరచుకుంటూ వచ్చింది. అది బతుకు భావజాలం. ఆధిపత్య వ్యతిరేక పోరాట నినాదం. ఒక రాజకీయ నినాదం కాదు. అనేక ప్రజాస్వామిక, సామ్యవాద భావజాలాల్ని కలగలిపి తయారుచేసింది . వాటిని కార్యక్రమం ఉంది. శ్రమ జీవులు శ్రమ ఫలితాన్ని పొందడమే లక్ష్యం. అన్ని రాజకీయ పార్టీల నుండి ఊరిని విముక్తం చేయడమే ఆమె కవిత. బతకడం కోసం పోరాటం చేసే హక్కుని రక్షించడమే దీక్ష. పునాదుల్లో పేరుకుపోయిన పితృస్వామ్యం, మతం, కులహెచ్చులు, దురహంకారాలను, దునుమాడడం మనిషిని అవమానాలకు గురిచేసే శక్తులను ఏరేయాలనే ఆలోచనలు… ఇదీ ఆమె తాత్విక భావజాలం.
మనుషులు తమ భాషని, పరికరాల్ని, ప్రకృతిని, మానవ సంబంధాలను, శ్రమ విలువను పొందే హక్కు కోసం పోరాడ్డమే తన కార్యాచరణ. సామాన్య ప్రజల నోటి సాహిత్యం, కళలు సాంస్కృతిక రూపాలు, మాండలికాలు, వృత్తి పదసంపద తదితర ప్రజల భాషారూపాల పరిరక్షణ హక్కు కోసమే ఈమె జీవ తపన. పైవన్నీ కలగలిసిన రంగమే ఆమె కవిత్వాలోచనా కాంక్ష. ప్రతి అక్షరం ఈ ఆకాంక్షలోంచే రచింపబడ్డాయి. సాహిత్యాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా వింగడిo చారు. కాని లలిత అవాస్తవ సాహిత్యానికి ‘కళేబర సాహిత్యం’ అని పేరు పెట్టింది. కొత్త పేరుతో కొత్త విభాగానికి ఖాతా తెరిచింది. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో వృత్తి, ఉత్పత్తి రంగాల సాహిత్యం కనబడదు. దాని కోసం పరిశోధనలు చేసే వాళ్ళకు “భూమిలోపల మా శవాలను తవ్వుకోండి. రాసులకు రాసులు తవ్వుకున్నంత దొరుకుతుంది” అదే కళేబర సాహిత్యం అని అంటుంది. ఎంతో సటిల్‌గా శ్రమజీవుల సాహిత్యం కవులు రాయలేకపోయారని స్పష్టం చేస్తుంది.
‘కోలల లోతుల్లో ఆమె’ కవితలో ‘గడ్డపారలాంటి వెన్ను’ కలిగిన వడ్డెర స్త్రీ కాంక్రీటు పాలనలో చిత్తయ్యింది. బావిలోతు కొలిచే ‘కోల’ ఆమె. కోల్పోతున్న ఆమె గొంతుకకి లలిత తన రెండక్షరాల్ని మద్దతుగా ఎగరేస్తుంది. ఇలాంటి జీవితాల్ని అటు ప్రగతిశీలం గాని, ఇటు స్త్రీ వాదం గాని హృదయపూర్వకంగా స్పర్శించలేదు./ ఇంకా దబ్బనం దూరని డొక్కలున్నాయి. పల్లేరుగాయల తొవ్వల / మామిడికాయ తోటల /మామిడి పిందెని తింటే చెట్టుకిందే చంపేస్తారు.ఆ వైనాన్ని ఉండేలు దెబ్బలకు / రాలిన బక్క శ్రీను’ గురించి ‘పిడసగట్టిన నాలుక’ కవితలో బోల్డ్ రాసింది. తన తండ్రిని “పంచముఖ బ్రహ్మ”గా పేర్కొంటూ రాసిన కవితలోనూ /“తలను డాకలిగా / ఊపిరిని తిత్తులుగా / చేతులను హతారలుగా / కాళ్ళను పెద్ద బాడిశలుగా /తడారి పోయే గొంతుకలకు / గుండె నుండి నెత్తుర్ని సాకపోస్తూ / సమస్త ఆకలి పేగులకు/ తన తనువును అంకితమిస్తూ / కాలేకడుపును కొలిమిగా / రాజేసిన అసలు సిసలు/ నిత్యాగ్ని హోత్రుడు / మా నాయన….” అని తండ్రి శ్రమని వర్ణించిన తీరు సరికొత్తది./ తల్లి గురించి రాసిన ‘ ఊతం కావాలి’ కవితలో ‘పంటల కెల్ల గొప్ప పంట కడుపుతీపి’. అలాంటి మాధుర్యం సమాజం కోల్పోతోందన్న వాస్తవాన్ని నొక్కి చెప్పింది.
ఓయులో జరిగిన ‘మూలధ్వని’ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ‘మంగ’ అనే కోయ వనితను చూసి ౠ ‘ఆమె ఒక ధ్వని’ అనే కవితలో “ఆమె ఒకలయ / ఆమె ఒక అనాది సంగీతం / ఆమె ఒక గుజ్జిడి మొగ్గ / ఆమె ఒక గిల్లగజ్జె / ఆమె ఒక మూలధ్వని / ఆమె ఆది మహా విద్వాంసురాలు” అని రాసింది. ఆదివాసీ స్త్రీకి ఇంతకన్నా మరే సర్టిపికేట్ కావాలి? చివరగా ‘ముంతగూడు’ కవితని పూర్తిగా ఊటంకించకుండా ఉండలేకపోతున్నాను. కవితా సంకలనం రాకముందే ప్రొ. గూడూరు మనోజ ఈ కవితని ఇంగ్లీషులోకి అనువాదం చేసింది. అనేక మంది మెప్పులు పొందిన ఈ కవితని చదవండి.
వంటింట్లో /ఎండిన మోదుగాకుల దోర్నం /సాటుకు ఉన్న ముంత గూడే / మా అమ్మకు బీరువా /పన్నెండు మందాల కప్పు కింద /దాగిన ముంత గూడులు తనాబీలు / తూప్రాశి తాటి దూలాలు / పరద చెక్కల గూడులో / నాయిన సన్నకురాళ్లు బర్మోలలు / మట్టి యింటి మీద / కాంక్రీటు ల్యాండ్ మైనేదో పేలింది / ముంత గూడులో/ అమ్మ దాసుకున్న / ఎకానెత్తు ముక్కుపోగు/ బారానెత్తు గజ్జెలనాగరం/కొలిమి పనిముట్లు / దాతి కలపలతో / పది మందికి పని నేర్పిన / మా నాయన ప్రొఫెసరు / మా అమ్మ ఆఫీసరు/ మా యిల్లు / చేతివృత్తి పనుల యూనివర్శిటీ / శానం పదునుకు / తెగిన యినుప సూరు / చెక్కపెళ్ల చెత్త/ దుగోడ పొల్లు చెదారం / ఎనుబై ఆరు యేండ్ల నిండా/ రెక్కలు పెడరెక్కలు / ఇంకా రిటైర్ కాలేదు / పెన్షన్ లేదు/ కాలాన్ని బొక్కి దౌడల కింద / నములుతూ ముంత గూడులో / దాసుకున్న యాదులెన్నో / కండ్ల కెల్లి ధారై కారుతున్నయి / అమ్మ/ సెమట సుక్క తడవని/ ఇల్లు / కూలిన ఎడారి/ ఈ కవితకి వ్యాఖ్యానం అవసరం లేదు. కవిత చదివాక మన గుండె చేసే దడదడ శబ్దాలే వ్యాఖ్యానం.
నేనింక అధికంగా ఏమీ చెప్పలేను. జీవన, ప్రాదేశిక, ఆకలి వాస్తవికతను తట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళే కవిత్వంలోకి వెళ్ళండి. మాండలిక భాషా శక్తిని అనుభూతిగా మార్చాలనుకునే వాళ్ళు పుటలు తెరవండి. ఒక్కోసారి ఒళ్ళు జలదరిస్తే చదవడం ఆపేయండి ౠ మన:శ్శరీరాలకు మంచిది. కవిత్వ రచనలో ఫ్రెష్ వ్యక్తీకరణలు తప్పక మిమ్మల్ని ఊగిస్తాయి. శ్రామిక చెమట వాసనలు కొత్త పరిమళాలై తప్పక ఏడో రుచి చూపిస్తాయి. పాఠకులలో కొంత పరివర్తన తెస్తుంది. కొన్ని రోజూ వినే మాటలే కవిత్వ చరణాలై మనని వెంటాడుతాయి. వైవిధ్యత, ఘర్షణ, నిజాయితీల మిశ్రమం ఈ కవిత్వం. జీవన పోరాటంలోంచి మనల్ని తట్టిలేపే కవిత్వానికి ఆహ్వానం పలుకుదాం.

ప్రొ. జయధీర్ తిరుమలరావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News