Wednesday, January 22, 2025

సొంత ప్రతిష్టకే ప్రధాని మోడీ అయోధ్య ప్రతిష్ట: మణిశంకర్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

కొజికోడ్ : అంతాతానే తానొక్కడే తరహాలో అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనను ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించడం అనుచితం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. ఇప్పుడు జరిగే పద్ధతిలో రామాలయ ప్రతిష్టాపన ఘట్టానికి తాము హాజరుకాబోమని నలుగురు శంకరాచార్యులు పేర్కొన్న విషయాన్ని ఈ దశలో కేంద్ర మాజీ మంత్రి అయిన అయ్యర్ శనివారం మీడియాతో భేటీ దశలో గుర్తు చేశారు. ఈ నలుగురు పెద్దలు ఆహ్వానాన్ని తిరస్కరించడం కీలక పరిణామం అని, దీనికి ప్రధాని మోడీ తగు మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని మణిశంకర్ తెలిపారు. మోడీ అయోధ్యలో రామాలయ ప్రారంభ ఘట్టం నిర్వహణ తీరు వల్ల ఆయనకే చేటు కల్గిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి పరిణామాల నేపథ్యంలో వాస్తవిక హిందువు ఎవరనేది ప్రజలకు తెలిసివస్తుందని చెప్పారు.

హిందూయిజం, హిందూత్వ మధ్య వ్యత్యాసాలు తెలిసిన వారికి వాస్తవిక హిందువు ఎవరనేది వెల్లడవుతుందని తెలిపారు. పూరీ శంకరాచార్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో తాను అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని తెలిపారు. ఆగమశాస్త్ర పద్ధతుల ప్రకారం రామాలయ ప్రతిష్ట పద్ధతిగా సాగే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం అయిందని శంకరాచార్య చెప్పిన విషయాన్ని అయ్యర్ ఈ నేపథ్యంలో గుర్తు చేశారు. ఇక్కడ జరుగుతోన్న ఏడవ కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటున్న నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. అయోధ్యలో పూర్తి స్థాయి మతపరమైన కార్యక్రమం అంతటిని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా నిర్వహించాలనుకోవడం పట్ల హిందూ మత పెద్దలు పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. రామాలయ నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉన్న దశలో ప్రధాని మోడీ తన ప్రతిష్టకు లేదా రాజకీయ లబ్థికి రామాలయ ప్రతిష్ట నిర్వహించడం ఎంతవరకు సబబని నిలదీశారు.

ఇది తాను చెప్పడం లేదని ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ మఠం మతపెద్ద విముక్తేశ్వరానంద సరస్వతి చెప్పిన మాట అని అయ్యర్ గుర్తు చేశారు. హిందూయిజం భారతదేశంలో అత్యంత ప్రాచీన మతం. దేశంలోని అత్యధిక ప్రజలు దీనిని పాటిస్తారని, అత్యధిక హిందువులు ఆచరించే రాజకీయ సిద్ధాంత ప్రక్రియనే హిందూత్వ అని తెలిపారు. హిందువుల్లో అత్యధికులు కనీసం 50 శాతం వరకూ ఎప్పుడూ హిందూత్వకు పట్టం కట్టలేదని, అయితే గడిచిన పది సంవత్సరాలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణ తీరు వల్లనే హిందూత్వ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News