Sunday, September 8, 2024

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాణికం ఠాగూర్..

- Advertisement -
- Advertisement -

మిషన్ 2023పై ప్రధాన చర్చ
పార్టీలో మరిన్ని చేరికలుంటాయి
70-80 సీట్లలో గెలుస్తాం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో లంచ్ భేటీకి హాజరు
అనంతర మీడియాకు వివరాలను వెల్లడించిన మాణికం ఠాగూర్
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలుంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ చెప్పారు. ఆదివారం భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో ఆదివారం జరిగిన లంచ్ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మిషన్ -2023పై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 70 నుండి 80 మంది ఎంఎల్‌ఎలను వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పార్టీలో చేరికలతో పాటు చాలా విషయాలపై మాట్లాడినట్లుగా చెప్పారు. జడ్చర్ల మాజీ ఎంఎల్‌ఎ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ విషయంతో పాటు పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు చర్చించారు. అదే విధంగా నేతల మధ్య నెలకొన్న అగాధాలను పరిష్కరించే విషయంపై కూడా చర్చించారు. టిఆర్‌ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా చర్చించారు. మరోవైపు టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. పార్టీలో చేరికల విషయంలో ఈ సమావేశంలో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వివరించారు. పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సునీల్ ఇస్తున్న సమాచారం మేరకు పార్టీలో చేరికల విషయమై పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల పరిస్థితిపై సునీల్ నేతృత్వంలోని బృందం సమాచారం ఇస్తున్నారు. అంతేకాదు, ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయమై కూడా సునీల్ టీమ్ ఎఐసిసికి ఇస్తుంది. ఈ సమాచారం ఆధారంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయనే విషయమై కూడా ఠాగూర్ వివరించారని సమాచారం. అయితే పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయింపు విషయమై వీరి మధ్య చర్చకు వచ్చిందని సమాచారం. అయితే సర్వేల ఆధారంగా ఏ అభ్యర్థిని బరిలోకి దింపితే పార్టీ విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయనే విషయమై సర్వేలు నిర్వహించనున్నారు. ఈ సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఈ విషయమై ఠాగూర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 80 అసెంబ్లీ స్థానాల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం.

Manickam Tagore meet Komatireddy Venkat Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News