Monday, December 23, 2024

హస్తం.. అల్లకల్లోలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి ఆయన వైదొలగడంతో ఒక్క సారిగా కలకలం బయలు దేరింది. మాణికం ఠాగూర్ బాధ్యతల నుంచి వైదొలిగారని, నాలుగైదు రోజుల తర్వాత హైకమాండ్ కొత్త ఇంచార్జ్ ను ప్రకటించే అవకాశం ఉందని సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన ఎంపి అయిన మాణికం ఠాగూర్ తెలంగాణకు ఇంచార్జ్‌గా వచ్చినప్పటి నుండి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. డబ్బులు తీసుకుని పదవి వచ్చేలా చేశారన్నారు. ఆ తర్వాత కూడా పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని, సీనియర్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చేశారు. అయితే మాణికంం ఠాగూర్ మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఎప్పుడూ బయట మాట్లాడలేదు. వారంతా రేవంత్, ఠాగూర్‌ను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. చాలా కాలంగా ఈ గ్రూపు గొడవలను భరిస్తున్నానని ఇక ముందు తాను భరించలేనని రాహుల్ గాంధీకి మాణికం ఠాగూర్ తేల్చి చెప్పారని అంటున్నారు.

వాట్సాప్ గ్రూప్ ఎగ్జిట్ వార్తలపై స్పందించిన మాణికం ఠాగూర్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ రాష్ట్ర పిసిసి వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ గ్రూప్ నుంచి తాను తప్పుకున్నట్లు కథనాలు వచ్చిన కాసేపటికే మాణికం ఠాగూర్ అది వాస్తవమేనని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ బాధ్యతల నుంచి మాణికం ఠాగూర్ తప్పుకుంటారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ కథనాలను తోసిపుచ్చిన ఎఐసిసి ప్రతినిధి బోసురాజు.. మాణికం ఠాగూర్ ఎఐసిసి వాట్సాప్ గ్రూప్‌లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీగా మాణికం ఠాగూర్ ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర నాయకులతో విడివిడిగా మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఎఐసిసికి నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో గత వారం పదిరోజులుగా మాణికం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. ఎఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీలు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు రాజీనామా లేఖలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మాణికం ఠాగూర్ రాజీనామా ఆమోదిస్తే.. ఇప్పటికే కొత్త ఇంఛార్జీని నియమించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ జరగలేదు.

హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
ఇప్పుడు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే వారిపై ముందుగానే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే దిగ్విజయ్‌సింగ్‌ను పంపి సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే తాము పిసిసి నిర్వహించే కార్యక్రమాలను వెళ్లబోమని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వవొద్దని ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకునేలా చాన్స్ ఇస్తే చాలని సీనియర్లు అంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News