Saturday, December 21, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వాయిదా ?

- Advertisement -
- Advertisement -

ఈ నెల 17వ తేదీన కేవలం గ్యారంటీలను ప్రకటించనున్న కాంగ్రెస్
విజయభేరీ సభలో కీలక నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్: మేనిఫెస్టోను సుదీర్ఘ అధ్యయనం తర్వాతే వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీన కేవలం గ్యారంటీలను మాత్రమే పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. 17వ తేదీన మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ సమయ భావం తక్కువగా ఉండటం వల్ల అది సాధ్యపడేలా లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పార్టీ నాయకత్వం, మేనిఫెస్టో కమిటీ కేవలం గ్యారంటీల పైనే దృష్టి సారించినట్టుగా తెలిసింది.

5 పథకాలతో పార్టీకి మైలేజ్
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. సోనియా గాంధీ ప్రకటించే గ్యారంటీలను కేవలం వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఇది పార్టీ మైలేజీని పెంచడమే కాకుండా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ నాయకులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యారంటీలపై పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మేనిఫెస్టోతో పాటు పార్టీకి చెందిన కీలక నాయకులంతా గ్యారంటీలపై అధ్యయనం చేస్తున్నారు. నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల నుంచి కీలకమైన ఒక్కో అంశాన్నీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సునీల్ కనుగోలు సూచించిన అంశాలు
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నిర్వహించిన మూడు సర్వేలు ఆధారంగా కూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ఏ పథకాలతో మేలు జరుగుతుంది? రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటీ? అనే అంశాలను నేరుగా పార్టీ పెద్దలకు సునీల్ కనుగోలు ఇప్పటికే వివరించారు. ఈ అంశాలన్నీ మేనిఫెస్టో కమిటీకి చేరాయి. వీటిపై కమిటీతో పాటు రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

అభిప్రాయాల కోసం ప్రత్యేకమైన రూం
ఇక మేనిఫెస్టోలోని అంశాల చర్చ, ప్రజలు, ప్రజా సంఘాలు, ఇతర నేతలు కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు గాంధీభవన్‌లో ఓ ప్రత్యేకమైన రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబరుతో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. వివిధ కుల సంఘాల నేతలు, ప్రతినిధులు, హక్కుల కార్యకర్తల నుంచి పలు అంశాలను సేకరించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News