Friday, November 22, 2024

మేనిఫెస్టోలకు మళ్లీ విలువ

- Advertisement -
- Advertisement -

ఇటీవలి ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైఎస్‌ఆర్ సిపిలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తమ ఎన్నికల సభలలో, అదే విధంగా మీడియా ద్వారా వాటికి చాలా ప్రచారం కల్పించాయి. బిజెపి జాతీయస్థాయి నుంచి అదే పని చేసింది. కాంగ్రెస్ జాతీయ స్థాయి నుంచి తెలంగాణ కోసం అదనపు మేనిఫెస్టో సైతం ప్రకటించింది. రెండు రాష్ట్రాలోనూ ప్రజలు వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించి చర్చించుకున్నారు. ఇంత వరకు జరిగిన ఎన్నికలలో మేనిఫెస్టోలపై ఇంతింత ప్రచారాలు గాని, చర్చలు గాని మునుపెన్నడూ లేవు. అందుకు కారణమేమిటి అన్నది ఒక ప్రశ్న కాగా, రాగల కాలంలో దీని పర్యవసానాలు ఏమిటనేది మరొక ప్రశ్న.

మన ఎన్నికల రాజకీయాలలో క్రమంగా ఒక విశేషం చోటు చేసుకుంటున్నది. అది, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకు మళ్లీ విలువ ఏర్పడుతుండటం.మేనిఫెస్టోలు ప్రతిసారి షరా మామూలుగా లేక ఒక మొక్కుబడిగా విడుదల అవుతూనే ఉంటాయి. కాని వాటికి స్వాతంత్య్రానంతరపు మొదటి ఎన్నికలు అయిన 195152 నుంచి కొంత కాలం వరకు విలువ ఇచ్చిన ప్రజలు, తర్వాత క్రమంగా పట్టించుకోవటం మానివేశారు. ఇది నెహ్రూ కాలంలోనూ జరిగింది. ఆ వెనుక ఇందిరా గాంధీ గరీబీ హటావో నినాదం నుంచి తిరిగి విలువ వచ్చి, కొన్నేళ్లకు సమసిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎన్‌టిఆర్ ఎన్నికల హామీలు ఆయన మేనిఫెస్టోకు విలువ ఇవ్వగా, తిరిగి ఇంత కాలానికి రాష్ట్ర విభజన పిమ్మట, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇదే స్థితి కనిపిస్తున్నది.

ఈ రోజున ప్రజలు ఆయా పార్టీల మేనిఫెస్టోలలో ఏమున్నదో తెలుసుకోవటమే గాక, ఆ హామీల అమలు ఏ విధంగా సాగుతున్నదో అడుగడుగునా ఒక కంట జూస్తున్నారు. ఇంతకూ పార్టీలు మేనిఫెస్టోలను ఎందుకు జారీ చేస్తున్నాయి? వాటిని ఎందుకు అమలు చేస్తున్నాయి లేదా చేయడం లేదు? అమలు తీరును ప్రజలు ఏ పరిస్థితులలో పట్టించుకుంటున్నారు లేదా పట్టించుకోవడం లేదు? అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలను అన్వేషించడంలో మనకు మన దేశ స్థితిగతుల గురించి, పార్టీల బయటి స్వరూపంతో పాటు నిజమైన స్వభావాల గురించి, ప్రజల సమస్యలు, అవసరాలు, ఆలోచనలు, ఎన్నికలకు సంబంధించిన వ్యవహరణలు, పార్టీల గురించిన అవగాహనలకు సంబంధించి బోధపడేది చాలా ఉంటుంది. అయితే ఆ సుదీర్ఘమైన చర్చ ఇక్కడ చేయలేము గనుక, కొన్ని విషయాలు స్థూలంగా చూద్దాము. ఈ పని వర్తమానంతో మొదలు పెట్టి, తర్వాత వెనుకకుపోదాము.

ఇటీవలి ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తమ ఎన్నికల సభలలో, అదే విధంగా మీడియా ద్వారా వాటికి చాలా ప్రచారం కల్పించాయి. బిజెపి జాతీయస్థాయి నుంచి అదే పని చేసింది. కాంగ్రెస్ జాతీయ స్థాయి నుంచి తెలంగాణ కోసం అదనపు మేనిఫెస్టో సైతం ప్రకటించింది. రెండు రాష్ట్రాలోనూ ప్రజలు వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించి చర్చించుకున్నారు. ఇంత వరకు జరిగిన ఎన్నికలలో మేనిఫెస్టోలపై ఇంతింత ప్రచారాలు గాని, చర్చలు గాని మునుపెన్నడూ లేవు. అందుకు కారణమేమిటి అన్నది ఒక ప్రశ్న కాగా, రాగల కాలంలో దీని పర్యవసానాలు ఏమిటనేది మరొక ప్రశ్న.

ముందుగా ఒక మాట సూటిగా చెప్పాలంటే, పార్టీల మధ్య అధికారం కోసం స్పర్ధలు పెరుగుతున్నాయి. అధికారం లభించినట్లయితే ప్రజలకు చేయగల సేవ, అభివృద్ధి ఏమిటన్నది అట్లుంచితే, అందువల్ల తమకు లభించగలది ఏమిటో వారికి బాగా తెలుసు. ఇది గతంలోనూ తెలిసిన విషయమే. కాని ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశం లో సంపదలు బాగా పెరుగుతున్నాయి. వాటిని తాము సంపాదించుకొనగల అవకాశాలు కూడా అందుకు తగినట్లు పెరుగుతున్నాయి. కనుక, ప్రజలను ఏ విధంగానైనా సరే మెప్పించి లేదా లోగడకన్న ఆశలను పెంచి గెలిచి తీరాలి. అందువల్ల మేనిఫెస్టోలు ఈ స్థితిని ప్రతిఫలిస్తున్నాయి. ఇది ఒక పోటాపోటీ పాప్యులిజంగా మారింది.

పార్టీలకు సంబంధించిన పరిస్థితి ఇది కాగా, ప్రజలు విషయాన్ని సహజంగానే తమ కోణం నుంచి చూస్తున్నారు. ఇందులో ఇటీవల కనిపిస్తున్న మార్పు ఏమంటే, గతంలో మొత్తం సమాజపరంగా, సామూహిక సమస్యలూ పరిష్కారాల దృష్టితో చూస్తుండిన ప్రజలు ఇటీవల వ్యక్తులుగా, కుటుంబాలుగా ఆలోచించి తమకు కలిగే ప్రయోజనం ఏమిటని గమనిస్తున్నారు. అట్లా, ఎప్పటికప్పుడు ఎవరి వల్ల ఎక్కువ లాభమని చూస్తున్నారు. నిజానికి ప్రజలలో వస్తున్న ఈ మార్పు గురించి ఇప్పటికే కొందరు పరిశీలకులు ఎత్తి చూపారు. ఇది ప్రజలు వినియోగదారులుగా (కన్జూమర్స్) మారటమన్న మాట. ఈ మార్పు వచ్చిన కొద్దీ వారికి ఏ పార్టీ పట్ల కూడా దీర్ఘకాలపు విధేయతలు ఉండవు. నెహ్రూ, ఇందిర, ఎన్‌టిఆర్ వంటి సందర్భాలలో వలే. ఎప్పటికప్పుడు ఎవరెక్కువ ఇస్తారో చూడటంగా మారిపోతుంది.

ఇటువంటి పోటాపోటీ పాప్యులిజం, ప్రజల కన్జూమరిజం వల్ల మేనిఫెస్టో రచయితలపై ఒత్తిడి పెరుగుతుంది. మేనిఫెస్టోలు ఇంకా ఇంకా ఆకర్షణీయంగా తయారవుతుంటాయి. వాటి అమలు సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా. ఓటర్లు కూడా లోపలి సరకు నాణ్యతతో నిమిత్తం లేకుండా ప్యాకేజీ ఆకర్షణ మాయలో పడినట్లు, ఏ పార్టీ తన మేనిఫెస్టోలో ఏమివ్వజూపుతున్నదనే దానికే పరిమితమవుతారు. ఒక విధంగా ఇది పెట్టుబడిదారీ మార్కెట్ తళుకు బెళుకుల యుగ ధర్మం వంటిది. ఇందుకు మూలాలు గత రెండు ఎన్నికల నుంచే ఉన్నా, ఈసారి ఆ లక్షణాలు చాలా పెరిగాయి. ఈ పరిణామ క్రమం మునుముందు ఎట్లుండవచ్చు? ఇదే విధంగా కొనసాగవచ్చునా? ఇంకా పెరగవచ్చునా? లేక పెరుగుట విరుగుట కొరకేనన్న సూత్రం ప్రకారం విరిగిపడవచ్చునా? యథాతథంగా చూసినపుడు, ఈ తరహా పోటాపోటీ పాప్యులిజానికి, ఒక రాష్ట్ర వాస్తవిక ఆర్థిక పరిస్థితులకు మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. అపుడు ఇవి విరిగిపడక తప్పదు. మరొక వైపు నుంచి చూడాలంటే, ఇటువంటి హామీల ప్రభావం తో మేనిఫెస్టోల పట్ల గతంలో లేనంతటి ఆసక్తిని చూపుతున్న ప్రజలు లేదా వాటి అమలుపై ఆశ పడుతున్నవారు, అటువంటి వైరుధ్యం మూలంగా అమలు వీలు కాదని గ్రహించినపుడు, ఆకాశం నుంచి నేల పైకి దిగిరా గలరు. దాని పర్యవసానంగా వారికి మునుముందు మేనిఫెస్టోలపై ఇటువంటి ఆసక్తి ఉండదు.

అనగా మనమిపుడు ఒక కృత్రిమమైన, తాత్కాలికమైన దశలో ఉన్నాము. మేనిఫెస్టోల పట్ల వేర్వేరు దశలలో ప్రజలకు ఆసక్తి లేదా నిరాసక్తి, నమ్మకం లేదా అపనమ్మకం ఏ విధంగా ఉండేవో పైన సూచనాప్రాయంగా చూశాము. అదే పద్ధతిలో ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకున్నట్లయితే ప్రజలకు మేనిఫెస్టోల పట్ల పోటాపోటీ పాప్యులిజం పట్ల ఇపుడున్న ఆసక్తి ఒక కృత్రిమ దశ అని గ్రహించవచ్చు. దీనంతటికి మూలం ఎక్కడ ఉందంటే, నెహ్రూ, ఇందిర, ఎన్‌టిఆర్ వంటి వారికి ప్రజల పట్ల ఏదో ఒక స్థాయిలో ఉండిన నిజమైన చిత్తశుద్ధి గలవారు ఇపుడు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. మరొక వైపు ప్రజలలో ముఖ్యంగా కొత్త తరాలలో చిత్తశుద్ధి గల నాయకుల పట్ల విధేయులుగా ఉండే వారి కన్న ఆధునిక అవసరాలు, ఆలోచనలను బట్టి కన్జూమర్లుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. అయితే, పోటాపోటీ పాప్యులిజానికి, దానిని ప్రతిఫలించే మేనిఫెస్టోల పట్ల ప్రజల ఆసక్తి ఎంతగా పెరుగుతున్నదో, అదే ఆసక్తి కారణంగా అటువంటి మేనిఫెస్టోలకు సవాళ్లు కూడా అంతగా పెరుగుతాయి. అది సహజం. అపుడేమవుతుందన్నది మనం మునుముందు చూడగలం.

గతానికి వెళ్లినట్లయితే, నెహ్రూ కాలపు మేనిఫెస్టోలు పేదల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్య, వైద్య సదుపాయాల వంటివి మినహాయిస్తే, ప్రధానంగా రాజ్యాంగంలో, చట్టాలలో, పంచ వర్ష ప్రణాళికలలో ఉండిన వాటి అమలుకు హామీ ఇచ్చేవి. అంతే తప్ప పాప్యులిజం లేదు. వివిధ కారణాల వల్ల వాటి అమలు పరిమితంగా జరిగింది. ఆ కాలంలో అక్షరాస్యత తక్కువ. మీడియా ఇంతగా లేదు. అందువల్ల ప్రజలు జరిగిన మేలునే పదివేలనుకుని నెహ్రూకు, ఆయన పార్టీకి విధేయులుగా కొనసాగారు. ప్రసంగాలలో ఇచ్చిన హామీలూ, నినాదాలను తప్ప మేనిఫెస్టోలను పట్టించుకోలేదు.ఇందిర కాలం వచ్చే సరికి పరిస్థితులు మారసాగాయి. ఒక వైపు పేదరికం పెరగడం, ఉద్యమాలు ఎక్కువ కావడం, ఆమెకు రాజకీయ పోటీలు ఎదురవటం వంటి పరిణామాల మధ్య తను పాప్యులిజం వైపు మళ్లక తప్పలేదు. కాని గమనించవలసిందేమంటే, ఆమె పాప్యులిజం ఒక పరిమితి లోనే ఉంది.

వాటిలో అనేకం అమలుకు గట్టి ప్రయత్నమే చేశారు. అందుకే ప్రజలు మేనిఫెస్టో పట్ల ఆసక్తి చూపటమే గాక, నెహ్రూ, ఇందిర రాజ్యాల పట్ల దీర్ఘకాలం పాటు విధేయులుగా ఉన్నారు ఆ కాలంలో ఆ తర్వాత కాలంలో తమిళనాడు పార్టీలు, కర్నాటకలోని దేవరాజ్ ఆర్స్ ప్రభుత్వం, ఎన్‌టిఆర్ వంటి వారు ఇదే శ్రద్ధ చూపటం తెలిసిందే. కాని ఆ తర్వాత నుంచి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో కొంత, నాయకుల క్షీణ స్థాయి వల్ల కొంతగా పరిస్థితులు బాగా కాంపిటీటివ్ పాప్యులిజంగా మారాయి. మేనిఫెస్టోల స్వభావం, వాటి పట్ల విశ్వాస అవిశ్వాసాలు కూడా అదే ప్రకారం ఉన్నాయి. విలువ కూడా ప్రస్తుతం ఒక తాత్కాలిక దశగా అట్లానే కనిపిస్తున్నది. ఇది క్రమంగా ప్రజాస్వామ్య పరిణతికి దారి తీయగలదా? పార్టీలు, ప్రజలు కూడా ఈ తీరులో పాలను గ్రహించి సవ్యమైన విధంగా వ్యవహరించగలరా అన్నది అంతిమ ప్రశ్న.

టంకశాల అశోక్
98481 91767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News