1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు పెండింగ్‌లో ఉంటే
ఆరు నెలల్లో చెల్లించాలని ఆదేశం భూముల స్వాధీనంపై
వక్ఫ్‌బోర్డు ఇష్టానుసారం వ్యవహరించడం తగదని
స్పష్టీకరణ వక్ఫ్ భూములని భావిస్తే ఆధారాలతో
నోటీసులివ్వాలని, సర్వే నివేదికను ప్రభుత్వానికి
సమర్పించాలని ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాలోని ల్యాంకో హిల్స్ నిర్మాణ (జాగీర్) భూములపై సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో వక్ఫ్ బోర్డుకు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ సర్వే నం.59, 65, 71, 102, 185 నుంచి 229, 231 నుంచి 237, 240, 241, 243, 244, 246, 247, 248, 249, 250, 251, 252, 252, 254, 256, 257, 258, 259,260, 262 నుంచి 266 లోని మొత్తం 1654.32 ఎకరాల భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానికేనంటూ సుప్రీంకోర్టు న్యా యమూర్తులు హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈక్రమంలో దాదాపు 50వేల కోట్ల రూపాయల (అంచనా) విలువ చేసే 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో ప్రభుత్వానికి ఊరట లభించినట్లయ్యింది. వివరాల్లోకి వెళి తే..దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదమైంది.
ఆ ప్రాంతంలో దర్గాకు కేవలం ఒక ఎకరం మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈక్రమంలో 1654 ఎకరాలు 32 గుంటలు తమవే నంటూ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ట్రిబ్యునల్ మద్దతుతో మణికొండ దర్గా వక్ఫ్ ట్రైబ్యునల్ మద్దతుతో కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మధ్య కొన్నేళ్ల పాటు భూముల వివాదం కొనసాగింది. ఈ భూముల్లో కొంత భాగం అప్పటికే 2001లో ఐఎస్‌ఇబికి, 2004 తర్వాత ఎంఆర్ ప్రాపర్టీస్, ఇతరులకు టిడిపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయింపులు జరిపాయి. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం ఐటి సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సిల కోసం భూములను విక్రయించడంతో పాటు ఇతరులకు కేటాయింపులు జరిపింది. అయితే వక్ఫ్ బోర్డు ఆ భూములు దర్గాకు చెందినవని, ముఖ్యంగా హజ్రత్ హుస్సేన్ షా వలీకి దాదాపు 150 సంవత్సరాల క్రితం వారసత్వంగా వచ్చిన ఆస్తిగా పేర్కొంది. ఇందుకు వక్ఫ్ బోర్డు ట్రెబ్యునల్ మద్దతు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి, వక్ఫ్‌బోర్డుకి మధ్య నెలకొన్న భూ వివాదం హైకోర్టుకు చేరింది. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సుప్రీంకోర్టులో మణికొండ జాగీర్ భూముల కేసు కొనసాగింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఈ మేరకు 156 పేజీల తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ వెలువరించింది. ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని, భూముల స్వాధీనం విషయంలో వక్ఫ్‌బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని, సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఆయా భూములు వక్ఫ్‌బోర్డువని తేలితే రూ.50వేల కోట్లు కడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు విన్నవించారు.